ఉషా చిలుకూరి బంధువుల్ని భూతద్దం వేసి మరీ బయటకు తీస్తున్న మీడియా

తాజాగా ఉషా చిలుకూరి బంధువులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు.. విశేషాలు వెలుగు చూస్తున్నాయి

Update: 2024-07-18 04:54 GMT

మూడు రోజుల క్రితం సాదాసీదా వారికి మాత్రమే కాదు.. అమెరికాలో ప్రముఖులుగా చెలామణీ అయ్యే వారికి సైతం ఉషా చిలుకూరి అన్నంతనే గుర్తు పట్టేవారు కాదు. ఇప్పుడు అందుకు భిన్నం. ఎప్పుడైతే ఆమె భర్తను రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారో ఇప్పుడామె సుపరిచితురాలైంది. అంతేనా.. ఆమెకు సంబంధించిన సంగతులను తెలుసుకోవటం మీద బోలెడంత ఆసక్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో.. ఆమె కుటుంబంతో పూర్వ అనుబంధం ఉన్న పలువురు తెర మీదకు వస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన మీడియా సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

తాజాగా ఉషా చిలుకూరి బంధువులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు.. విశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఉష తల్లిదండ్రులు క్రిష్ణా జిల్లాకు చెందిన వారే అయినప్పటికీ ఆమెకు బోలెడంతమంది బంధువులు విశాఖపట్నంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరి గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. తొంభై ఏళ్లకు పైచిలుకు (కచ్ఛితంగా చెప్పాలంటే 96 ఏళ్లు) వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పటం.. పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మ గురించి చెప్పాలి.

ఆమెకు ఉష మనమరాలు వరుసఅవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు ప్రొఫెసర్ గా పని చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన మరణించారు. వారికి.. ఉషకు ఉన్న బంధం ఏమంటే..సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఆయన కొడుకు రాధాక్రిష్ణ. ఆయన సంతానమే ఉషా చిలుకూరి. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాకు వెళ్లిపోవటం.. ఉష సైతం అక్కడే పుట్టి పెరిగిన కారణంగా ఆమెతో తనకు పరిచయం లేదన్న విషయాన్ని శాంతమ్మచెబుతున్నారు.

అయితే.. ఉష మేనత్త శారద చెన్నైలో ఉంటారని.. ఆమె వైద్యురాలిగా పని చేస్తున్నారని శాంతమ్మ చెబుతున్నారు. అంతేకాదు.. ఉష పెళ్లికి ఆమె అమెరికాకు వెళ్లారని చెప్పారు. తమ బంధువులు అమెరికాలోని వివిధ సంస్థల్లో అత్యున్నత స్థానాల్లో పని చేస్తున్నారని.. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లిన విషయం తెలియగానే చాలా సంతోషంగా.. గర్వంగా అనిపించినట్లుగా ఆమె చెప్పారు.

ఇక.. ఉష పూర్వీకులకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని చెబుతున్నారు ఉయ్యూరు మండలానికి చెందిన రామ్మోహన్ రావు. ఉష పూర్వీకులు క్రిష్ణా జిల్లా నుంచి చాలా ఏళ్ల క్రితమే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లుగా ఆయన చెబుతున్నారు. 18వ శతాబ్ధంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించేవారని.. ఆయన సంతానం శాఖోపశాఖలుగా విస్తరించి.. చివరకు ఉష వరకు విస్తరించినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఉస ముత్తాత వీరావధాన్లు అని.. ఆయనకు రామశాస్త్రి.. సూర్యనారాయణ శాస్త్రి.. సుబ్రహ్మణ్యశాస్త్రి.. వెంకటేశ్వర్లు.. గోపాల క్రిష్ణమూర్తి ఐదుగురు సంతామని.. అందరూ ఉన్నత విద్యావంతులుగాపేర్కొన్నారు. ఉషతో తమకున్న బంధురికం గురించి వెల్లడించిన రామ్మోహన్ రావు.. ‘‘ఉష తాత రామశాస్త్రి చిన్న తమ్ముడు గోపాలక్రిష్ణమూర్తి. ఆయన. నేను తోడల్లుళ్లం. ఒక ఇంటి ఆడుపడుచులనే పెళ్లి చేసుకున్నాం’’ అంటూ తమకున్న బంధం గురించి వివరించారు.

Tags:    

Similar News