ఓర్నీ.. తెలుగోళ్ల బుద్ధి పోనిచ్చుకున్నారు కాదుగా? ఉష కులం లెక్కలివేనట
తెలుగోళ్లు మరోసారి తమ బుద్ధి చూపించుకున్నారు. ఎవరైనా వార్తల్లో వ్యక్తిగా మారినంతనే.. వారి గురించిన ఆసక్తి సహజంగా కలుగుతోంది
తెలుగోళ్లు మరోసారి తమ బుద్ధి చూపించుకున్నారు. ఎవరైనా వార్తల్లో వ్యక్తిగా మారినంతనే.. వారి గురించిన ఆసక్తి సహజంగా కలుగుతోంది. ఇలాంటి వేళలో వాళ్లేం చదువుకున్నారు? వారి ఆసక్తులేంటి? వారి ఫిలాసఫీ ఏమిటి? వారి లక్ష్యాలు ఎలా ఉంటాయి? వాటిని సాధించేందుకు వారి కార్యాచరణ ఎలా ఉంటుంది? లాంటి అంశాలు ఉంటాయి. అలాంటివి ఉంటే వాళ్లు తెలుగోళ్లు ఎందుకు అవుతారు? తాజాగా అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి తెలుగమ్మాయి కావటం.. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావటంతో ఆమె మూలాల మీద ఆసక్తి వ్యక్కమైంది.
అక్కడితో ఆగని మనోళ్ల శోధన.. ఆమె స్వస్థలం వరకు తెలుసుకునే ప్రయత్నం చేయటాన్ని తప్పు పట్టలేం. ఎప్పుడైతే ఆమె సామాజిక వర్గం ఏమిటన్న దాని మీద ఫోకస్ పెట్టిన వైనం చూసినప్పుడు మాత్రం.. ‘ఓర్నీ’ అని అనుకోకుండా ఉండలేం. ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా..వారి కులం గురించి తెలుసుకునే వరకు నిద్ర పోని వైనం చిరాకు కలిగించకమానదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొన్ని ఇంటిపేర్లు రెండు..మూడేసి కులాల్లోనూ సేమ్ గా ఉంటాయి. ఇలాంటి వేళలో.. ఫలానా కులం అంటే.. కాదు ఫలానా కులం అంటూ వాదనలు జరుగుతుంటాయి కదా. అది మరింత వెగటుగా అనిపిస్తుంది. తాజాగా ఉషా చిలుకూరి విషయంలోనూ అలాంటి రచ్చ లాంటి చర్చ జరగటం గమనార్హం.
ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు మూలాలు ఉండటం.. ఆమె తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం.. ఆమె తండ్రి పేరు క్రిష్.. తల్లి పేరు లక్ష్మీ. వారి పూర్వీకులు ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన వారు. రెండు తరాల ముందు వారి ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చినట్లుగా తేల్చారు. ఉషా చిలుకూరి నానమ్మ.. తాతయ్యలు క్రిష్ణా జిల్లాలోని పామర్రు నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు. ఈ విషయాలన్ని బయటకు రావటానికి దాదాపు ఒక రోజు పట్టింది. దీనికి కారణం.. పామర్రు నుంచి వారి పూర్వీకులు హైదరాబాద్ కు యాభై ఏళ్ల క్రితం షిఫ్టు కావటంతో సమాచారం బయటకు రావటం కాస్తంత కష్టమైంది. కానీ.. చివరకు మనోళ్లు లెక్కలు తేల్చే వరకు విశ్రమించకపోవటం గమనార్హం.
ఇక.. హైదరాబాద్ కువచ్చిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి అమెరికాకు షిఫ్టు అయ్యారు. కాలిఫోర్నియాలో ఉండిపోయారు. ఉషా తండ్రి ఫిజషియన్ గా పని చేసి రిటైర్ అయ్యారు. స్వస్థలం తెలుసుకున్న తర్వాత.. సామాజిక వర్గం ఏమిటన్న దానిపై బోలెడంత ఆసక్తి వ్యక్తమైంది. ఎవరికి వారు.. తమకు బాగా తెలిసిన వారిని కనుక్కునే ప్రయత్నం చేయటం..ఇంటర్నెట్ ను గాలించేయటం లాంటివి చేశారు.
ఈ క్రమంలో ఉషా చిలుకూరి కమ్మ సామాజిక వర్గమని కొందరు.. కాదు.. కాదు ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గమని మరికొందరు వాదించటంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ రెండు సామాజిక వర్గాల్లోనూ చిలుకూరి ఇంటి పేరు ఉండటమే దీనికి కారణం. ఏతా వాతా చివరకు తేల్చిందేమంటే.. ఆమెది బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారుగా తేల్చారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కులాల లెక్కల్ని దాటకుండా ఇంకా అదే సర్కిల్ లో తిరిగే తెలుగోళ్లు ఎప్పటికి మారతారు? అన్నది అసలు ప్రశ్న.