అమెరికాలో భారతీయ కుటుంబం హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!

రాకేశ్‌ కమల్, ఆయన భార్య టీనా, కుమార్తె అరియానా మృతదేహాలకు వైద్యులతో శవపరీక్ష చేయించారు. వైద్యుల నివేదిక ప్రకారం.. రాకేశ్‌ కమల్‌ తన భార్య, కుమార్తెలను తుపాకీతో కాల్చి చంపాడు.

Update: 2024-01-03 14:27 GMT

గత నెల డిసెంబర్‌ 28న అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం వారి నివాసంలోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాకేశ్‌ కమల్‌(57), ఆయన భార్య టీనా(54), కుమార్తె అరియానా(18) నుంచి రెండు రోజులుగా ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి బంధువు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వీరి మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరోజు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెలుగు చూశాయి.

రాకేశ్‌ కమల్, ఆయన భార్య టీనా, కుమార్తె అరియానా మృతదేహాలకు వైద్యులతో శవపరీక్ష చేయించారు. వైద్యుల నివేదిక ప్రకారం.. రాకేశ్‌ కమల్‌ తన భార్య, కుమార్తెలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు నార్ఫోక్‌ డిస్ట్రిక్‌ అటార్నీ మైఖేల్‌ మోరిస్సే కార్యాలయం వివరాలు వెల్లడించింది. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక త్వరలో వస్తుందని పోలీసులు తెలిపారు.

రాకేశ్‌ కమల్‌ దంపతులు అమెరికాలో 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడ్యునోవా వెబ్‌సైట్‌ ప్రకారం.. రాకేశ్‌.. బోస్టన్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్, స్టాన్‌ ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయనకు విద్యారంగంలో విశేష అనుభవం ఉంది.

ఇక రాకేశ్‌ భార్య టీనా ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆమెకు రెడ్‌ క్రాస్‌ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది. ఈ దంపతులకు అరియానా కుమార్తె. ఈమె స్థానికంగా ఉన్న ఒక కళాశాలలో విద్యనభ్యసిస్తోంది.

వీరి నివాసం ఉంటున్న డోవర్‌.. మసాచుసెట్స్‌ రాజధాని బోస్టన్‌ డౌన్‌ టౌన్‌కు నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కాగా రాకేశ్‌ కమల్‌ ఇంటిలో పోలీసులు ఒక తుపాకిని కనుగొన్నారు. అయితే రాకేశ్‌ కు తుపాకీ లేదని, ఆయనకు అందుకు లైసెన్సు కూడా లేదని రికార్డులు చెబుతున్నాయి. దీంతో రాకేశ్‌ ఆ తుపాకీని ఎక్కడ నుంచి తెచ్చారనేది తేలాల్సి ఉంది. లేదా ఎవరైనా వీరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసులు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ సాగిస్తున్నారు. అయితే గృహ హింసలో భాగంగానే రాకేశ్‌ కమల్‌ ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News