జాహ్నవి మృతిపై వెకిలినవ్వులు...వివరణ ఇచ్చిన యూఎస్ పోలీస్!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-16 09:48 GMT

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే.. ఆమె మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అవును... జాహ్నవి మృతి చెందిన సమయంలో చేసిన వ్యాఖ్యలపై ఆ పోలీస్ అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా... ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని చెప్పారు. మరోవైపు, ఈ వివాదానికి కారణమైన అధికారికి సియాటెల్‌ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. ఇదే సమయంలో ఈ వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనలో... వైరల్‌ అయిన దృశ్యాలు బాడీక్యాం వీడియో రికార్డ్‌ చేసినవే అయినప్పటికీ... ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బయటికొచ్చింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయనే విషయం ప్రజలకు తెలియదు. పూర్తి వివరాలు తెలియకపోవడంతో అక్కడ ఏం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైంది" అంటూ డేనియల్‌ కు మద్దతుగా గిల్డ్‌ వ్యాఖ్యానించింది.

ఇదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్‌ రాసిన లేఖను కూడా గిల్డ్‌ విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని.. జాహ్నవిని ఎగతాలి చేయాలని కాదని ఆ లేఖలో పేర్కొన్నాడు.

ఇదే సమయంలో... ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో తాను చాలా సార్లు చూశానని, అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నానని డేనియల్‌ తన లేఖలో వివరించారని గిల్డ్ చెప్పింది.

అదేవిధంగా... బాధితురాలిని అవమానించాలనే విధంగా ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని డెనియల్ చెప్పారు. పూర్తి వివరాలు తెలియకపోతే.. ఇలాంటి దారుణమైన ఊహాగానాలే వైరల్‌ అవుతాయని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు పారదర్శకంగా దర్యాప్తు జరగాలని, తాను చెప్పింది వాస్తవం కాకపోతే ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని తెలిపారు.

కాగా... ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23) ఈ ఏడాది జనవరిలో సియాటెల్‌ లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్‌.. చులకనగా మాట్లాడుతూ వెకిలిగా నవ్విన వీడియో ఒకటి ఇటీవల ఆన్‌ లైన్‌ లో వైరల్‌ అయ్యింది.

ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్‌ కూడా ఈ విషయంపై అసహనం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారి డేనియల్‌ పై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News