వివేక్ తో డిన్నర్ చేయాలంటే రూ.41 లక్షలు ఖర్చు తప్పదంతే

తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో అమెరికా అభ్యర్థ రేసులో రిపబ్లికన్ పార్టీలోని అభ్యర్థుల్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ నిలిచారు.

Update: 2023-09-24 04:43 GMT

త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్ష అభ్యర్థుల రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. ఆయనకు ప్రత్యర్థిగా భారత మూలాలు ఉన్న వివేక్ రామస్వామి బరిలో ఉండటం తెలిసిందే. వీరిద్దరి మధ్య పోరు హోరాహోరీ అన్నట్లుగా ఉంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో అమెరికా అభ్యర్థ రేసులో రిపబ్లికన్ పార్టీలోని అభ్యర్థుల్లో ట్రంప్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ నిలిచారు.

ఇదిలా ఉండగా.. తన బలాన్ని మరింత పెంచేందుకు వరుస పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు వివేక్. తాజాగా ఆయన తన ఎన్నికల ప్రచారానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలతో నిధులు సేకరించే ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 29న ఒక ప్రత్యేక విందును నిర్వహిస్తున్నారు. ఈ విందుకు వివేక్ రామస్వామి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.

ఈ విందులో భాగం కావాలంటే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఉన్న సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా ఇంట్లో ఈ విందును నిర్వహిస్తున్నారు. ఈ డిన్నర్ ద్వారా భారీ ఎత్తున నిధుల్ని సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం చూస్తే పది లక్షల డాలర్ల నిధులు సమీకరణే లక్ష్యమని చెబుతున్నారు.

డిన్నర్ కు హాజరయ్యే వారి నుంచి భారీగా వసూలు చేస్తారు. ఒక అంచనా ప్రకారం చూస్తే.. వివేక్ రామస్వామితో జరిగే డిన్నర్ కు హాజరు కావాలంటే ఒక్కొక్కరు 50వేల డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.41 లక్షలుగా చెప్పొచ్చు. ఈ డిన్నర్ కు సంబంధించిన ప్రత్యేక ఇన్విటేషన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఇన్విటేషన్ లో 50వేల డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని క్లియర్ గా పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News