2.5 లక్షల మందిని వెళ్లిపోమంటున్న యూఎస్ వారిలో అత్యధికులు ఇండియన్సే!
దీంతో... సుమారు 2.5 లక్షల మందికి సరికొత్త సమస్య వచ్చినట్లయ్యింది!
ఊహ తెలిసీ తెలియని వయసులోనే తల్లితండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే పెరిగారు, అక్కడే చదువుకున్నారు, అక్కడే కొంతమందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. అయితే వీరిలో 21 ఏళ్లు నిండిన వారికి సరికొత్త సమస్య వచ్చి పడింది. ఇందులో భాగంగా... మీరంతా మా దేశాన్ని వదిలి వెళ్లిపోండని అంటుంది అమెరికా ప్రభుత్వం. దీంతో... సుమారు 2.5 లక్షల మందికి సరికొత్త సమస్య వచ్చినట్లయ్యింది!
అవును... తల్లితండ్రులతో చిన్నప్పుడే అమెరికాకు వెళ్లి, అక్కడే పెరిగి పెద్దై, ఇంకా గ్రీన్ కార్డ్ రానివారికి పెద్ద చిక్కొచ్చి పడింది. చిన్నప్పుడే పేరెంట్స్ తో వెళ్లి డిపెండెంట్ వీసాతో ఉన్న పిల్లల్లో 21 ఏళ్లు నిండిన వారికి అమెరికా షాకిచ్చింది. అలాంటి వారంతా దేశాన్ని విడిచి బయలుదేరాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో... ఏమిటీ వ్యవహారం, దీనివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
ఉదాహరణకు ఎక్స్ అనే ఓ బాలుడు చిన్నప్పుడే తల్లితంలతో కలిసి భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడ తల్లితండ్రులు ఉద్యోగం చేసుకోవడం.. ఇతడు పేరెంట్స్ పై ఆధారపడ్డ బిడ్డగా హెచ్-4 వీసా పై వెళ్లడం జరిగింది. ఈ సమయంలో హెచ్-1బీ వీసా ఉన్న అతడి పేరెంట్స్.. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారు. అదింకా పెండింగ్ లోనే ఉంది. ఇంతలో సదరు ఎక్స్ అనే అతడికి 21 ఏళ్లు నిండాయి.
దీంతో ఇప్పుడు అతడు అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. ఇలా ఉద్యోగాల మీద అమెరికాకు వచ్చే పేరెంట్స్ వెంట పిల్లల్ని అనుమతిస్తారు కానీ... వారికి 21 ఏళ్లు నిండేలోపు పేరెంట్స్ కి గ్రీన్ కార్డు వస్తే వారికీ శాస్వత నివాసం దొరికినట్లే. అలా కానిపక్షంలో... ఈ సమస్య ఎదురవుతుంది. పిల్లలకు ఉన్న డిపెండెంట్ వీసా రద్దవుతుంది. ఫలితంగా అమెరికా నుంచి పంపించేస్తారు.
ప్రస్తుతం ఇలాంటి సమస్యను ఎదుర్కోంటున్నవారి సంఖ్య సుమారు రెండున్నర లక్షలు ఉందని అంటున్నారు. వీరిలో భారతీయుల సంఖ్యే అత్యధికం అని స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో... సుమారు 43 మంది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల సెనెటర్లు వీరి కోసం బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇది కొలిక్కి రావడం లేదని అంటున్నారు.