స్టార్లు తమ కెరీర్ లో వైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చినప్పుడే ఆర్టిస్టుగా గుర్తింపు దక్కుతుంది. తెరపై రెగ్యులర్ పాత్రల్లో కనిపించే వారికి మైలేజ్ తక్కువ. ఇటీవల ట్రెండ్ ప్రతిభకు అనుకూలంగా మారింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తారలను పెర్ఫామెన్స్ ఆధారంగా దర్శకులు ఎంపిక చేసుకుంటున్నారు. నేటితరం హీరోయిన్లలో తక్కువ సమయంలో ప్రయోగాత్మక పాత్రలతో ఆకట్టుకుంటున్న బ్యూటీగా మాళవిక మోహనన్ కి గుర్తింపు దక్కుతోంది.
తాజాగా తంగళన్ లో మాళవిక లుక్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో మాళవిక అడవిలో బిజిలీగా ప్రత్యేకత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఈరోజు హీరోయిన్ మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. డి-గ్లామరస్ పాత్రలో మాళవిక రూపం అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది. మాళవిక ఈ చిత్రంలో గిరిజన మహిళగా నటిస్తోందని ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చింది.
చియాన్ విక్రమ్ ఇందులో మరోసారి వైవిధ్యమైన పాత్రతో మెరుపులు మెరిపించబోతున్నాడు. అతడి నటనకు మరోసారి జాతీయ అవార్డ్ రావడం ఖాయమని అభిమానుల్లో చర్చ సాగుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కబాలి ఫేం పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. నీలం ప్రొడక్షన్స్ -స్టూడియో గ్రీన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పార్వతి తిరువోతు, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. మేకింగ్ వీడియో విడుదలైనప్పటి నుండి ఈ కాలపు గ్రామీణ నాటకంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.