మహారాష్ట్ర వాసుల అన్నపూర్ణ ...శివ భోజన్ !

Update: 2020-01-27 05:54 GMT
శివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ మూడు పార్టీలు కలిసి 'మహా అఘాడీ' పేరుతొ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు గా రెండు నెలలకి పైగా రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న మహారాష్ట్ర లో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. రాష్ట్రంలోని పేదలు ఆకలి తో పస్తులుండకుండా చూడటమే తమ లక్ష్యమని,దానికోసం నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. ఈ లక్ష్యంలో భాగంగా పేదలకు పది రూపాయలకే భోజనం అందించే అపూర్వమైన పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకానికి శివ భోజన్ అనే నామకరణం చేసారు.

మొదటగా పైలట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో ఇవి ప్రారంభమవుతాయని, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని
సీఎం వెల్లడించారు. 'శివ్ భోజన్' పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆరంభించింది. ఈ పథకాన్ని ప్రవేశ పెడతామని శివసేన పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి 'మహా అఘాడీ' ప్రభుత్వం ఏర్పాటు కాగా, మేనిఫెస్టో లోని అంశాలను ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా సీఎం ముందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ పథకాన్ని మహారాష్ట్ర మంత్రి అస్లామ్ షేక్ రద్దీ ఎక్కువ గా ఉండే నాయిర్ ఆసుపత్రి వద్ద ప్రారంభించారు. బండ్ర కలెక్టర్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. శివ్ భోజన్ ప్లేటు లో రెండు చపాతిలు, ఒక ఆకుకూర, అన్నం, పప్పు ఉంటుందని చెప్పారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పేదలకు అందుబాటు లో ఉంటుందని వారు వివరించారు. ప్రతి క్యాంటీన్‌ లో సుమారు 500 ప్లేట్ల శివ్ భోజన్ పథకాన్ని పేదలు వినియోగించుకుంటారని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News