పిల్లాడి కోసం రూల్స్‌ని పక్కన పెట్టారు

Update: 2015-07-11 13:16 GMT
మానవత్వం వెల్లివిరిసింది. నిబంధనల్ని గౌరవించాల్సిందే. కానీ.. కొన్ని సందర్భాల్లో వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రూల్స్‌ని కళ్లతో కాకుండా మనసుతో చూసిన సందర్భం ఇది. ఒక చిన్నారి కోరికను తీర్చేందుకు అంత పెద్ద ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు వెనుకాడలేదు. పలువుర్ని ఆకర్షిస్తూ.. మరెంతో మంది అభినందనల్ని పొందుతున్న ఈ ఉదంతంలోకి వెళితే..

తమిళనాడుకు చెందిన పదకొండేళ్ల ముఖిలేష్‌ తీవ్రమైన తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నాడు. ఎప్పుడు చనిపోతాడో తెలీని ఆ చిన్నారికి ఒక కోరిక ఉంది. ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ కావాలన్నది అతని కోరిక. అతడి చిరకాల వాంఛ తీర్చేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది.

ఇందులో భాగంగా ఇతరులకు ఏ మాత్రం ప్రవేశం లేని ఎయిర్‌ఫోర్స్‌ ఉన్నతాధికారుల్ని సదరు స్వచ్ఛంద సంస్థ సంప్రదించింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో నిబందనలు పక్కాగా ఉంటాయి. చాలా కఠినంగా ఉంటాయి. అయితే.. ఆ చిన్నారి ఉదంతం విన్న అధికారులు అతడ్ని పైలట్‌ చేసేందుకు ఒప్పుకున్నారు. ఒకరోజు గౌరవ పైలట్‌ చేయటమే కాదు.. కోయంబత్తూరులోని వైమానిక దళ బృందం అతడికి బ్యాడ్జ్‌ని.. క్యాప్‌ని అందజేసి.. పైలట్‌ సీట్లో కూర్చొబెట్టారు.

అంతేకాదు.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో.. ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మనసుతో నిబంధనల్ని చూసినప్పుడు ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకుంటాయి. దీనంతటికి కారణమైన స్వచ్ఛంద సంస్థకు.. ఇండియర్‌ ఎయిర్‌ఫోర్స్‌కి అభినందనలు చెప్పాలి. ఈ మొత్తం ఘటన మరో రికార్డుకు దారి తీసింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అత్యంత పిన్న వయసులో ఇలాంటి అరుదైన గౌరవాన్ని పొందిన పిన్న వయస్కుడిగా ముఖిలేష్‌ రికార్డు సృష్టించాడు. ఈ ఉదంతం గురించిన విన్న ప్రతిఒక్కరూ అధికారుల్ని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News