అలాంటి ఎంపీలు.. ఎమ్మెల్యేలకు మూడిన‌ట్లే!

Update: 2017-12-13 04:03 GMT
కండ బ‌లం ఉంటే చాలు పాలిటిక్స్ లో బ‌తికేయొచ్చ‌న్న ధోర‌ణి కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. దీనికి మించి గుండె బ‌లంతో ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంద‌న్న విప‌రీత‌మైన  ధోర‌ణితో ప్ర‌ద‌ర్శించే నేతలు కొంద‌రు ఉంటారు. ఇలాంటి వారంద‌రికి బ్యాడ్ టైం మొద‌లైంది. పేరుకు ప్ర‌జాప్ర‌తినిధులైనా.. గుండాలు.. రౌడీల మాదిరి వ్య‌వ‌హ‌రించే ధోర‌ణి ప‌లువురిలో ఉంది.

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాజ్యాంగాన్ని.. చ‌ట్టాన్ని లెక్క చేయ‌ని తీరుకు నిద‌ర్శనంగా కేసులు న‌మోదు కావ‌టం తెలిసిందే. ఇలాంటి వారికి క‌ళ్లెం వేసేందుకు అవ‌కాశం లేక‌పోవ‌టం.. విచార‌ణ జాప్యంతో ఏళ్ల‌కు ఏళ్లు బండి న‌డిపేయ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది. అలాంటి రోజులు ఇక‌పై న‌డ‌వ‌న‌ట్లే.

ఎందుకంటే.. ప్ర‌జాప్ర‌తినిధులైన ఎంపీ.. ఎమ్మెల్యేల‌పై ఉన్న కేసుల్ని విచారించేందుకు 12 ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది. కాస్త గ‌డువు ఇస్తే వారిపై ఉన్న కేసుల స‌మాచారం సేక‌రించి.. విచార‌ణ వేగ‌వంతం చేస్తామ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకు హామీ ఇచ్చింది.

2014 వ‌ర‌కు ప‌వ‌ర్ లో ఉన్న.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న మొత్తం 1581 ఎంపీ.. ఎమ్మెల్యేల‌పై 13,500 కేసులు పెండింగ్ లో ఉన్న‌ట్లుగా కేంద్రం వెల్ల‌డించింది. నేర చ‌రిత ఉన్నోళ్లే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మ‌ళ్లీ పోటీ చేస్తున్న‌ట్లుగా గుర్తించారు. ఇలాంటి వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతుందే త‌ప్పించి త‌గ్గ‌టం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అంత‌కంత‌కూ పేరుకుపోతున్న ఈ కేసుల్ని ఏం చేస్తారు?  దీనికి ప‌రిష్కారం ఏమిటంటూ సుప్రీం తాజాగా ప్ర‌శ్నించిన నేప‌థ్యంలో కేంద్రం వివ‌ర‌ణ ఇచ్చింది.

ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉన్న కేసుల లెక్క చూసేందుకు ప్ర‌త్యేకంగా 12  ప్ర‌త్యేక కోర్టుల్ని ఏర్పాటు చేయ‌టంతో పాటు.. అవి ప‌ని చేసేందుకు వీలుగా రూ.7.80 కోట్ల‌ను కేటాయించ‌నున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌స్తుతం ఏర్పాటు చేసే 12 ప్ర‌త్యేక కోర్టుల‌తో కేసుల విచార‌ణ ఎంత వేగంగా సాగుతుందో చూసి.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్ర‌త్యేక కోర్టులు ఎన్ని అవ‌స‌ర‌మ‌వుతాయో లెక్క వేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ మాట‌ల‌న్నీ చేత‌ల్లోకి వ‌స్తే.. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు బ్యాడ్ టైం మొద‌లైన‌ట్లే.

Tags:    

Similar News