#ప్ర‌త్యేక హోదా:ఆడ‌లేక మ‌ద్దెల ఓడంటున్న కేంద్రం!

Update: 2018-03-12 15:55 GMT
``పాడిందే పాడరా పాచిపండ్ల దాసరీ ``అన్న త‌ర‌హాలోనే...... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా  మూడేళ్లుగా ఒకే పాట పాడుతున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి కేంద్ర‌ప్ర‌భుత్వానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని - 14 వ ఆర్థిక సంఘం ప్ర‌కారం ఏ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అయితే - ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని 14 వ ఆర్థిక సంఘంలో ఎక్క‌డా పొందుప‌ర‌చ‌లేద‌ని - ఆ సంఘం చైర్మ‌న్  వై వీ రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించిన త‌ర్వాత కూడా జైట్లీ ఆ రాగం మార్చ‌లేదు. తాజాగా, 14 వ ఆర్థిక సంఘం స‌భ్యుడు గోవింద రెడ్డి కూడా అదే విష‌యాన్ని ధృవీక‌రించారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కూడ‌ద‌ని తాము 14వ ఆర్థిక సంఘంలో ఎక్క‌డా చెప్ప‌లేద‌ని - ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా - కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై గోవింద రెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి 14 వ ఆర్థిక సంఘం నిబంధ‌న‌లు అడ్డుప‌డుతున్నాయ‌టూ.... కేంద్రం చేస్తున్న ప్ర‌చారాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఈ ర‌కంగా చెప్ప‌డం....ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు. ఒక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం....ఇవ్వ‌క‌పోవ‌డం పాల‌నా ప‌ర‌మైన వ్య‌వ‌హార‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలా....వ‌ద్దా...అన్న అంశంతో  భార‌త రాజ్యాంగానికి లేదా ఆర్థిక సంఘానికి ఎటువంటి సంబంధం ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు.

``ఆడలేక మద్దెల ఓడన్నట్లు``.....ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం ఇష్టం లేని కేంద్రం....ఆ నింద‌ను ఆర్థిక సంఘం పైకి నెట్టేసి చేతులు దులుపుకుంద‌న్న వాద‌న‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇదే విష‌యాన్ని తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో....ఆర్థిక సంఘానికి - ప్ర‌త్యేక హోదాకు ఎటువంటి సంబంధం లేద‌ని వైవీ రెడ్డి చెప్పార‌ని ప్ర‌స్తావించారు. ఆ విష‌యాన్ని గ‌తంలో కూడా ప‌లుమార్లు మీడియాకు వెల్ల‌డించాన‌ని - అయితే, ఆ విష‌యం ప‌ట్ల ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉదాసీన వైఖ‌రి వల్లే ....రాష్ట్రానికి ఈ గ‌తి ప‌ట్టింద‌ని ప్రెస్ మీట్ లో జ‌గ‌న్ మండి ప‌డ్డారు. ఇక‌నైనా - చంద్ర‌బాబు క‌ళ్లు తెరిచి ఆర్థిక సంఘానికి....ప్ర‌త్యేక హోదాకు సంబంధం లేద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News