17 మంది వలస కూలీలు దుర్మరణం !

Update: 2020-05-08 06:00 GMT
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17మంది మృతిచెందగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. లాక్ ‌డౌన్ కావడంతో చేతిలో పనిలేకుండా పోయింది. సొంతూళ్లకు వెళదామని వాళ్లంతా రెడీ అయ్యారు. ముల్లె మూట సర్దుకొని బయలుదేరారు.గురువారం నాటికి ఔరంగాబాద్ చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావస్తుండటం, పైగా అలసిపోవడంతో సేద తీరుదాం అనుకున్నారు. ఆ పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. ఎలాగూ లాక్‌డౌన్ కాబట్టి రైళ్లు రావేమోననుకొని అక్కడే నిద్రకు ఉపక్రమించారు.

అందరూ కలిసి ట్రాక్‌‌నే పడక చేసుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేచి ఊళ్లకు వెళదాం అనుకున్నారు. కానీ, వాళ్లు నిద్రలోనే కళ్లు మూస్తాం అనుకోలేదు. ఆ రైల్వే ట్రాకే తమ పాలిట మృత్యువు అవుతుందని ఊహించలేదు. కర్మద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జౌరంగాబాద్‌-జల్నా మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని చెప్పారు.

లాక్‌ డౌన్‌ వల్ల జల్నాలోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేసే వలస కూలీలు మధ్యప్రదేశ్‌ కు తిరిగి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. జల్నా నుంచి భూస్వాల్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి రైలులో మధ్యప్రదేశ్‌ వెళ్లాలని వారు భావించారు. అయితే దాదాపు 45 కి.మీ దూరం నడిచాక వారు రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన  లోకో పైలట్‌.. రైలును నిలిపివేసేందుకు ప్రయత్నించారని కానీ ఆ ప్రయత్నం విఫలమైందని రైల్వేశాఖ వెల్లడించింది. కాగా, లాక్‌డౌన్ దెబ్బకు సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు అడుగడుగునా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆకలితో అలమటిస్తూ, అనారోగ్య పాలవుతూ ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా.. ఈ దారుణం దేశ ప్రజలను తీవ్రంగా కలచి వేసింది.
Tags:    

Similar News