యోగి రాజ్యంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాకే

Update: 2018-02-03 10:02 GMT
నేరాలు.. ఘోరాలు.. గ్యాంగ్ స్ట‌ర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే నేర‌స్తుల‌కు అడ్డాగా బీహార్ ను చెబుతారు. త‌ర్వాత ఎక్కువ‌మంది చెప్పేది యూపీలో. అలాంటి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో గ‌డిచిన 48 గంట‌లుగా ప‌రిస్థితి మారిపోయింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇచ్చిన సంకేతాల‌తో యూపీ పోలీస్ శాఖ మాంచి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

48 గంట‌ల వ్య‌వ‌ధిలో 18 ఎన్ కౌంట‌ర్లు చేయ‌టంతో పాటు.. ప‌లువురు క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల్ని అదుపులోకి తీసుకున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. నేర‌స్తుల విష‌యంలో పీచ‌మ‌ణ‌చాలంటూ సీఎం స్వ‌యంగా ఆదేశాలు ఇవ్వ‌టంతో గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా పోలీసులు దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ 25 మంది క్రిమిన‌ల్స్ ను అదుపులోకి తీసుకోగా.. వారిలో ఒక క్రిమిన‌ల్‌ ను హ‌త‌మార్చారు. ఇక‌.. మిగిలిన చోట్ల పోలీసులు ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం కాల్పులు జ‌ర‌పాల్సి రావ‌టం.. నేర‌స్తులు మ‌ర‌ణించ‌టం జ‌రిగిపోయాయి. ముజుఫ‌ర్ న‌గ‌ర్‌.. గోర‌ఖ్ పూర్‌.. బులంద్ ష‌హ‌ర్‌.. షామ్లి.. హ‌పూర్.. మీర‌ట్‌.. స‌హ‌ర‌న్ పూర్.. కాన్పూర్‌.. ల‌క్నో త‌దిత‌ర  ప్రాంతాల్లో ఎన్ కౌంట‌ర్లు జ‌రిగాయి. అయితే.. అన్నిచోట్ల నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించామ‌ని.. కానీ వారు కాల్పుల‌కు దిగ‌టంతో ఆత్మ‌ర‌క్ష‌ణ కోనం వారిని ఎన్ కౌంట‌ర్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌వేళ‌.. రెండు ప‌క్షాల నుంచి కాల్పులు జ‌రిగితే.. ఎంతోకొంత మంది పోలీసులు గాయాలు కావ‌టం.. మ‌ర‌ణించ‌టం లాంటివి జ‌ర‌గాలి. కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌కుండా కేవ‌లం నిందితులు మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకోవ‌టం చూస్తే.. ఇవి ప్లాన్డ్ ఎన్ కౌంట‌ర్లుగా చెబుతున్నారు. ఈ స్పెష‌ల్ డ్రైవ్ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున న‌గ‌దు.. న‌గ‌లు.. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండ‌గా తాజా ఎన్ కౌంట‌ర్ డ్రైవ్ లో ఒక ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ కూడా మ‌ట్టుబెట్ట‌టం గ‌మ‌నార్హం. 33 కేసుల‌తో యూపీ పోలీసుల‌కు నిద్ర లేకుండా చేస్తున్న ఘ‌జియాబాద్ గ్యాంగ్ స్ట‌ర్ ఇంద్ర‌పాల్ ను సైతం పోలీసులు ఎన్ కౌంట‌ర్లో మ‌ట్టుబెట్టారు.

వ‌రుస‌గా.. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ఎన్ కౌంట‌ర్ల‌పై జాతీయ మాన‌వ‌హ‌క్కుల క‌మిష‌న్ స్పందించింది. మీడియా క‌థ‌నాల ఆధారంగా ఈ వ్య‌వ‌హారాన్ని సుమోటోగా స్వీక‌రించిన క‌మిష‌న్‌.. యోగి స‌ర్కారుపై తీవ్రంగా మండిప‌డింది. శాంతిభ‌ద్ర‌త‌ల్ని అదుపు చేసేందుకు తీసుకునే నిర్ణ‌యాలు హింస‌ను ప్రేరేపించేవిగా ఉండ‌కూద‌ని చెప్పింది. ఎన్ కౌంట‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌టం స‌రికాద‌ని చెప్పింది. మొత్తంగా పోలీసుల‌.. గ్యాంగ‌స్ట‌ర్ల మ‌ధ్య వార్ కొన్నిసార్లు సామాన్యుల‌కు ఇబ్బందిగా మారింది. నేర‌స్తుల విష‌యంలో తానిక ఉపేక్షించేది లేద‌న్న‌ట్లుగా యోగి స‌ర్కారు తీరు ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News