నాన్ ఏసీ భోజనం అయినా జీఎస్టీ బాదుడే

Update: 2017-08-14 04:47 GMT
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్క‌ర‌ణ అయిన జీఎస్టీ...విష‌యంలో అనుమానాలు నివృత్తి ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. అయితే అనుమానాలు నివృత్తి చేసినా కొద్ది సామాన్యులు గుండె గుబేలు అనే పరిస్థితి ఇంకా పెరుగుతోంద‌ని చ‌ర్చ సాగుతోంది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన క్లారిటీ ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఏసీ రెస్టారెంట్ లేదా హోటల్‌ లోని ఏ ప్రాంతం నుంచి ఆహారం కొనుగోలు చేసినా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

సాధారణంగా ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్ అయినప్పటికీ పార్శిల్ (టేక్ అవే) కౌంటర్ల వద్ద ఏసీ సౌకర్యం ఉండదు. అలాగే కొన్ని ఏసీ రెస్టారెంట్‌ లలో నాన్- ఏసీ డైనింగ్ విభాగం కూడా ఉంటుంది. జీఎస్టీ చట్టంలో నాన్-ఏసీ హోటళ్లలో ఆహారంపై పన్ను రేటును 12 శాతంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఏసీ రెస్టారెంట్‌ లోని నాన్ ఏసీ ప్రాంతంలో విక్రయించే ఆహారంపై ఎంత శాతం పన్ను వర్తిస్తుందనే విషయంపై సందిగ్ధం నెలకొంది. దాంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఏసీ రెస్టారెంట్ లేదా హోటల్‌ లోని ఏ ప్రాంతం నుంచి ఆహార సేవలందించినా 18 శాతం పన్ను వర్తిస్తుందని తెలిపింది. లిక్కర్ లైసెన్సు కలిగిన ఏసీ రెస్టారెంట్‌ లో ఆహారంపై 18 శాతం - ఐదు నక్షత్రాల హోటళ్లయితే 28 శాతం పన్ను వర్తిస్తుంది.

మ‌రోవైపు సోలార్ యంత్రాలపై 5 శాతం జీఎస్టీని పునఃసమీక్షించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర బొగ్గు - విద్యుత్ - పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, అయినా వ్యాపారులకు సమస్యలుంటే ఏం చేయలేమని అన్నారు. సోలార్ మాడ్యూల్స్‌కు వర్తించే 5 శాతం పన్ను మిగతా యంత్రాలకు సైతం వర్తిస్తుందా అని తయారీదారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News