ఎమ్మెల్యే స్టిక్క‌ర్‌ తో త‌ప్పించుకునేందుకు య‌త్నం: ‌యువ‌కుడి అరెస్ట్‌

Update: 2020-05-05 09:10 GMT
కరోనా క‌ట్ట‌డి లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ తో రోడ్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో కొంద‌రు తుంట‌రోళ్లు బ‌య‌ట తిరుగుదామ‌ని భావించి రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. అలా వ‌చ్చిన ప్రజలపై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రావ‌డం లేదు. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి వ‌క్ర‌మార్గాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ యువ‌కుడు ఏకంగా ఎమ్మెల్యే స్టిక్క‌ర్ వాడేసి బ‌య‌ట తిరుగుతున్నాడు. అయితే పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో అత‌డి ర‌హాస్యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు క‌ట‌క‌టాల‌పాలైన సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో చోటుచేసుకుంది.

లాక్‌డౌన్‌ సమయంలో బయటకు వెళ్ల‌డానికి ముంబైలోని అంధేరికి చెందిన 20 ఏళ్ల సబెత్ అస్లాం షా తన హోండా సివిక్ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ను అంటించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ స‌మ‌యంలో వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని శ్రీ ప్రసాద్ హోటల్ వ‌ద్ద పోలీస్ చెక్ పాయింట్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా పోలీసులు తనిఖీలు చేశారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను పోలీసులు ఆస‌క్తిగా చూశారు. అనుమానం వ‌చ్చి వివ‌రాలు సేక‌రించారు. ఆ యువకుడిని వివ‌రాలు అడిగి తెలుసుకోగా న‌కిలీ ఎమ్మెల్యే స్టిక్క‌ర్ వాడాడ‌ని గుర్తించారు. పోలీసులు తనిఖీ చేయకుండా ఉండటానికి స్టిక్కర్ ఉపయోగించినట్లు ఆ యువ‌కుడు అంగీకరించాడు. దీంతో ఆ యువకుడిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఐపీసీ, విపత్తు నిర్వహణ చట్టం, రాష్ట్ర రాయబార కార్యాలయం, ఇతర చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News