2030కి పెట్రోల్ డీజిల్ వాహనాలు ఉండవా?

Update: 2020-11-15 14:30 GMT
ప్రకృతిని చెరబడితే వినాశనం ఎంత దారుణంగా ఉంటుందో కరోనా వైరస్ కళ్లకు కట్టింది. ప్రపంచంలోని అందరినీ ఇంట్లో కూర్చుండబెట్టింది. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టుగా మనిషిని సెట్ రైట్ చేసింది. ఇప్పటికైనా మనం ప్రకృతిని ప్రేమించాలన్న నిజాన్ని అందరికీ తెలియజెప్పింది.

ఈ క్రమంలోనే అందరికంటే ముందుంగా తేరుకుంది బ్రిటన్ దేశం. పదేళ్ల తర్వాత బ్రిటన్ లో పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్లు ఉండకుండా నిషేధం విధించింది. 2030 నుంచి పెట్రోల్ , డీజీల్ తో నడిచే కొత్త వాహనాల అమ్మకాలపై బ్రిటన్ లో నిషేధం విధించనున్నట్లు బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించబోతున్నారట.. వచ్చేవారమే ఈ నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది.

వాస్తవానికి 2040 నుంచి బ్రిటన్ లో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధం విధించాలని అనుకున్నారు. కానీ కరోనా రాకతోపాటు గ్రీన్ హౌజ్ వాయువుల ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రధాని ఈ నిర్ణయాన్ని పదేళ్లకు తగ్గించనున్నట్లు సమాచారం. వాహనాల అమ్మకాల నిషేధాన్ని 2030కే అమలు చేయాలని నిర్ణయించినట్టు మీడియా పేర్కొంది. ఎలక్ట్రిక్, శిలాజ ఇంధన చోదక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేసే కొన్ని హైబ్రిడ్ కార్లకు మాత్రం వెసులుబాటు ఇస్తారని తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటివరకు కొత్త కార్ల అమ్మకాల్లో పెట్రోల్, డీజీల్ కార్లే అత్యధికంగా ఏకంగా 73.6శాతం వీటినే కొంటున్నారు. కేవలం 5.5 శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చేస్తున్నట్టు పరిశ్రమ గణాంకాలలో వెల్లడైంది.

ఇప్పుడు బ్రిటన్ మాత్రమే కాదు.. ప్రపంచం కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణాన్ని కాపాడేందుకు ఒక ఐదేళ్లు అటూ ఇటూగా పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరోనా వంటి ఉపద్రవాలు మరో రెండు మూడు వస్తే ఖచ్చితంగా ప్రపంచం మార్పు కోరుకుంటుందని.. దెబ్బకు అందరూ మారిపోతారని అంచనా వేస్తున్నారు.







Tags:    

Similar News