ఎన్ కౌంటర్లో 23 మావోల్ని ఏసేశారు

Update: 2016-10-24 06:20 GMT
మావోల కార్యక్రమాలు ఇటీవల బాగా తగ్గుముఖం పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అందుకు భిన్నంగా చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ ఇప్పుడు అందరిని విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవల కాలంలో మావోలకు తగిలిన భారీ ఎదురుదెబ్బగా దీన్ని చెప్పొచ్చు. ఆంధ్రా.. ఒడిశా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఈ భారీ ఎన్ కౌంటర్లో ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం 23 మంది మీవోలు మరణించినట్లు చెబుతున్నారు. ఒక పోలీసు అధికారికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రా.. ఒడిశా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మావోల్ని భారీగా దెబ్బ తీసినట్లుగా చెప్పొచ్చు. ఎన్ కౌంటర్ జరిగిన తీరును చూస్తే..

విశాఖ జిల్లా ముంచుంగిపుట్టి నుంచి బూసుపుట్టికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగినట్లుగా చెబుతున్నారు. రోడ్డు కోట ఏరియా పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ సమీపంలోని రామగృహ కేంద్రంగా కాల్పులు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోల ప్లీనరీ నిర్వహించనున్నారన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసు బృందాలు.. దాదాపు వంద మంది ప్లీనరీ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎదురుపడిన వేళ.. మావోలు కాల్పులు ప్రారంభించారని.. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 23 మంది మావోలు మృతి చెందినట్లుగా చెబుతున్నారు.

మృతి చెందిన మావోలలో 16 మంది మావోలు ఉండగా.. మరో ఏడుగురు మహిళా మావోలుగా పోలీసులు చెబుతున్నారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మావోలు పెద్ద ఎత్తున మరణించగా.. వారికి సంబంధించి భారీ డంప్ దొరికినట్లుగా తెలుస్తోంది. పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మావో అగ్రనేత రామకృష్ణను పోలీసులు టార్గెట్ చేయగా.. ఆయన మృతి చెందగా.. ఆయన కుమారుడు మున్నా ఈ ఎన్ కౌంటర్లో మరణించినట్లు తెలుస్తోంది. మరో మావో అగ్రనేత ఉదయ్ కూడా మృతుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్ కౌంటర్ పూర్తి అయిన తర్వాత పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేప్టటారు. సమీప ప్రాంతాల్లో మరికొందరు మావోలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరణించిన మావోలు ఎవరన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేమని.. గుర్తింపు కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నారు. మృతదేహాల్ని ఒడిశాకు తీసుకెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. పోస్ట్ మార్టరం ప్రక్రియ సమయంలో మరణించిన వారిని నిర్దార్ధిస్తారని.. అనంతరం పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News