దారుణం : 23 మంది వలస కూలీలు మృతి !

Update: 2020-05-16 05:15 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న మహమ్మారి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే దేశంలో ఈ వైరస్ ను అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల కూడా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా సొంతఊర్లకి వెళ్తున్న వలస కార్మికులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి పోవడంతో వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కాలినడకన వెళుతూచనిపోయిన సందర్బాలున్నాయి. కానీ, రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది చనిపోతుండడం అందర్నీ కలిచి వేస్తోంది. తాజాగా  ఉత్తరప్రదేశ్లో  ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు.

ఈ ఘటన పై పూర్తీ వివరాలు చూస్తే .. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడం తో ఈ దుర్ఘటన జరిగింది. ఔరాయ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వలస కూలీల ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఈ ఘటన జరిగింది.  దీంతో 23 మంది అక్కడికక్కడనే చనిపోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల రోదనలతో మారుమ్రోగుతోంది.

బాధితుల్లో చాలా మంది బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ‌కు చెందిన వారు ఉన్నట్టు ఔరాయ జిల్లా కలెక్టర్ అభిషేక్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మద్యే  సొంత గ్రామాలకు వెళుతూ..రైలు పట్టాలపై పడుకున్న వలస కూలీలపై నుంచి రైలు వెళ్లడంతో 16 మంది వలస కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే...మొత్తంగా ఈ లాక్ డౌన్ వలస కార్మికుల పాలిట శాపంగా మారింది.
Tags:    

Similar News