ఏపీ వాసులకు ఇప్పటికైనా 3 రాజధానుల తుత్తి తీరిందా?

Update: 2021-05-14 15:30 GMT
దేశంలోని ఏ రాష్ట్రమైనా ఒక రాజధాని లేదంటే భౌగోళిక ఇబ్బందుల నేపథ్యంలో రెండు రాజధానులు ఉంటాయి. అది కూడా రాజధాని నగరంలోనే అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేస్తారు. అందుకు భిన్నంగా ఒక రాజధాని కూడా సరిగా లేని రాష్ట్రంలో.. ముచ్చటగా మూడు రాజధానులంటూ కొత్త నినాదాన్ని వినిపించటం.. దానికి అధికార వికేంద్రీకరణ.. అన్ని ప్రాంతాలు సమంగా డెవలప్ కావటం లాంటి మాటలు చెప్పిన వైనం వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఎన్ని తిప్పలన్న విషయం ప్రజలకు ఇట్టే అర్థమవుతోంది.

కరోనా విలయం నేపథ్యంలో వైద్య సాయం కోసం ఏపీ ప్రజలు ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల వైపు దీనంగా చూస్తున్నారు. కేసు కాస్త కాంప్లికేటెడ్ గా మారినా.. మరో ఆలోచన లేకుండా అయితే చెన్నై.. లేదంటే.. బెంగళూరు.. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నోళ్లంతా మహానగరానికి వాహనాలు కట్టుకొని వాలిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్లు అవుతోంది. అయినా.. ఇప్పటికి మంచి వైద్యం కోసం వేరే రాష్ట్రాల రాజధానుల వెంట పడాల్సిన ఖర్మ ఉందా?
రాష్ట్రాన్ని విభజిస్తే.. పాలన కూడా చేతకాదన్న అహంకారపు మాటలు మాట్లాడిన ఏపీ నేతలు ఈ రోజున తల ఎక్కడ పెట్టుకుంటారు. ఆరోగ్యం కాస్తా తేడా కొట్టిందంటే.. ఉన్న రాష్ట్రాన్ని వదిలేసి.. పక్కనున్న రాష్ట్రానికి పరుగులు తీయాల్సిన దుస్థితికి కారణం ఎవరు? విభజన ముందు సోయి లేకుంటే లేకపోయింది. విభజన తర్వాత.. కీలకమైన వైద్య రంగాన్ని డెవలప్ చేయటం కోసం నాటి సీఎం చంద్రబాబు.. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ లు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీకి అమరావతి రాజధాని అనుకున్నది కాస్తా.. మూడు రాజధానులుగా మార్చటంతో.. అమరావతి కేంద్రంగా డెవలప్ కావాల్సిన ఎన్నో ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయి. ఒక మహానగరం చుట్టూ అన్ని మౌలిక సదుపాయాలు చోటు చేసుకుంటాయి. అంతేకానీ.. రాజధాని నగరాల్ని మూడు ముక్కలుగా చేసి.. మూడు ప్రాంతాల్లో మూడు విభాగాల్ని పెడతామని చెప్పినప్పుడు.. రాష్ట్రానికంటూ ఒక రాజధాని నగరం లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అదెంతన్నది తాజా పరిణామాల్నిచూస్తే ఇట్టే అర్హవుతుంది. గడిచిన ఏడేళ్లలో అమరావతిని మహానగరంగా డెవలప్ చేసే పనిలో ఉండి ఉంటే.. ఈ రోజున కార్పొరేట్ ఆసుపత్రుల కోసం.. ప్రైవేటు ఆసుపత్రుల కోసం ఇంతగా ఆరాటం చెందాల్సిన అవసరం ఉండేదా? అన్నది ప్రశ్న.  మేం మామూలోళ్లం కాదు.. ఏపీ వాళ్లం. మాకు ఒక రాజధాని ఏం సరిపోతుంది.. మూడు రాజధానుల్ని మొయింటైన్ చేసే సత్తా మా సొంతమని జబ్జలు చరిచినోళ్లంతా ఈ రోజున ఏమైపోయారు? సరిహద్దుల వద్ద తమ వాహనాల్ని ఆపొద్దంటూ వేడుకుంటున్న వైనం చూస్తే.. రాజధాని విషయంలో ఏపీ ప్రజల ముందుచూపు లేమికి ఈ రోజున మూల్యం చెల్లించాల్సిన దుస్థితి. కాదంటారా?
Tags:    

Similar News