కరోనా ఎఫెక్ట్...కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో తెలుగు మెడికోలు

Update: 2020-03-17 16:30 GMT
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దాదాపుగా అన్ని దేశాల వాసులను బెంబేలెత్తిస్తోంది. ఏ పని మీద విదేశాలకు వెళ్లినా... కరోనా ప్రస్థానం మొదలైన తర్వాత స్వదేశాలకు చేరాలనుకుని బయలుదేరుతున్న వారు విదేశాల్లోనే ఎక్కడికక్కడ చిక్కుకుపోతున్నారు. అది కూడా మార్గ మధ్యలో చిక్కుకుపోతున్న వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఇలాంటి విపత్కర పరిస్థితి మన తెలుగు విద్యార్థులకు ఎదురైంది. వైద్య విద్య అభ్యసించేందుకు మనోళ్లు ఫిలిప్పీన్స్ కు భారీగానే వెళుతున్న విషయం తెలిసిందే కదా. అలా ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతున్న తెలుగు విద్యార్థులు కరోనా నేపథ్యంలో స్వదేశానికి పయనమై... మలేసియా రాజధాని కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. కౌలాలంపూర్ లో విమానం మారే క్రమంలో... మలేసియా నుంచి భారత్ కు విమానాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.... గడచిన మూడు రోజులుగా అక్కడే ఎయిర్ పోర్టులోనే మన విద్యార్థులు పడిగాపులు పడుతున్నారట.

ఆ వివరాల్లోకి వెళితే... ఫిలిప్ఫైన్స్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు మూడు రోజుల క్రితం ఇండియాకు బయలుదేరారు. కౌలాలంపూర్‌లో ఫ్లైట్ మారాల్సి వుండగా.. అక్కడే చిక్కుకుపోయారు. భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేయడంతో తెలుగు విద్యార్థుల బృందం ఎయిర్‌పోర్టులోనే మూడు రోజులుగా మగ్గుతున్నారు. సుమారు రెండు వేల మంది దాకా తెలుగు విద్యార్థులు ఫిలిప్ఫైన్స్‌ లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి హాలిడేస్ ప్రకటించారు. దాంతో స్వదేశానికి వద్దామనుకున్న వీరందరికీ.. విదేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారింది.

మనీలా నుంచి కౌలాలంపూర్ చేరుకున్న తమకు ఇండియాకు వెళ్ళే ఫ్లైట్ దొరక్కపోవడంతో ఎయిర్‌ పోర్టులోనే ఉండిపోయామని తెలుగు విద్యార్థులు వీడియో సందేశాలను తమ పేరెంట్స్‌కు పంపుతున్నారు. అవి కాస్తా మీడియాకు చేరుతున్నాయి. తమ ‌బృందంలో కేవలం విద్యార్థులమే లేమని.. చాలా మంది వయోజనులు కూడా వున్నారని.. వారిలో ఇమ్యూన్ పవర్ తక్కువ వుండడం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా భారత్ రప్పించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలని అర్థిస్తున్నారు.

అయితే.. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ లో దీనికి సంబంధించి వచ్చిన వార్తలకు కౌలాలంపూర్‌ లోని ఇండియన్ అంబసీ స్పందించింది. ప్రస్తుతం మొత్తం 230 మంది విద్యార్థులు కౌలాలంపూర్ ఎయిర్‌ పోర్టులో వున్నారని.. గుర్తించారు. వారిని ఫోన్‌లో సంప్రదించిన ఎంబసీ అధికారులు.. వారందరికీ విమాన టిక్కెట్లు అరేంజ్ చేస్తామని.. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే వారికి ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే... కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విద్యార్థుల్లో బాలుర కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారట. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

   

Tags:    

Similar News