బీజేపీ భారీ ఫైన్లకు ‘భరత్ అనే నేను’నే కారణమట!

Update: 2019-09-04 10:26 GMT
అనుకున్నదంతా అయ్యింది.. భరత్ అనే నేను మూవీలో అమలు చేసిన కఠిన ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు దేశంలోనూ అమలయ్యాయి. దీంతో వాహనదారులు మొత్తుకుంటున్నారు. రోడ్డుపైకి రావడానికి జంకుతున్నారు. కొత్త వాహనం చట్టం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.

తాజాగా హెల్మెట్ పెట్టుకోలేదని గురుగ్రామ్ కు చెందిన టూవీలర్ రైడర్ కు ఏకంగా 23వేల ఫైన్ విధించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ద్విచక్రవాహనదారులంతా దీనిపై ఆందోళన చెందారు.

ఇక ఇదే గురుగ్రామ్ లో ఓ ఆటోకు భారీ మొత్తంలో జరిమానా విధించారు. ఏకంగా 32,500 ఫైన్ వేశారు. దీంతో అంత చెల్లించలేక ఆ ఆటో వాలా మహ్మద్ ముస్తాకిల్ తన ఆటోనే పోలీసులకు వదిలి వెళ్లిపోయాడు.   ధ్రువీకరణ పత్రాలు ఇంట్లో ఉన్నాయని చెబుతున్నా పోలీసులు 32వేల ఫైన్ వేశారని.. అవన్నీ తీసుకొచ్చి పోలీసులపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఆటోవాలా చెబుతున్నారు. ఈ దారుణ ఫైన్లపై కోర్టులోనే తేల్చుకుంటానంటున్నాడు..

ఇలా కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ, ఏపీల్లో దీన్ని సీరియస్ గా అమలు చేయకపోవడంతో ఇప్పటివరకు ఎవరికీ ఇంతలా ఫైన్లు పడలేదు. వెలుగులోకి రావడం లేదు.

అయితే ఈ కొత్త జరిమానాలపై నెటిజన్లు, సాధారణ ప్రజలు సోషల్ మీడియాలో తమ కసినంతా బీజేపీ ప్రభుత్వంపై తీర్చుకుంటున్నారు. తెలుగులో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమాను చూసే ఈ ఫైన్లు వేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ ఐడియాను బీజేపీ వాళ్లకు ఇచ్చింది దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబులేనా అని కొందరు మీమ్స్ రూపొందిస్తున్నారు.

అయితే కేంద్రం ఆగమేఘాల మీద కొత్త వాహన చట్టం రూపొందించి జనాల నుంచి ముక్కుపిండీ జరిమానాలు వసూలు చేస్తున్నా ఇప్పటికీ రోడ్లపై కనీస మౌళిక సదుపాయాలు లేవని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పట్టణాలు - నగరాల్లో పార్కింగ్ ప్లేసులు లేవని.. ఏదైనా షాపింగ్ మాల్ లో వాహనం  నిలుపడానికి స్పేస్ లేదని... యథేచ్చగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలకు అనుమతలిస్తూ వాటి ముందు వాహనాలు పెడితే భారీ జరిమానాలు విధిస్తున్న ప్రభుత్వ తీరును నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. ముందు ప్రజలకు - వాహనాదారులకు కనీస సదుపాయాలు కల్పించాక ఇలాంటి ఫైన్లు వేస్తే బాగుంటుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.
Tags:    

Similar News