కేసీఆర్ స‌ర్కారుకు 3,800 కోట్ల జరిమానా.. ఎందుకంటే!

Update: 2022-10-03 15:31 GMT
తెలంగాణ‌లోని కేసీఆర్ ప్ర‌భుత్వానికి భారీ దెబ్బ త‌గిలింది. 3800 కోట్ల రూపాయ‌ల‌ను జ‌రిమానాగా చెల్లించాలంటూ..  ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు, తీర్పులు.. ప‌క్కాగా అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. రూ.3,800 కోట్ల జరిమానాను 2 నెలల్లో ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప‌ట్ల  స‌ర్కారు తీరుపై ట్రిబ్యున‌ల్ తీవ్ర ఆందోళ‌న‌, ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింది.

అంతేకాదు.. వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టి.. పురోగతి చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. `పర్యావరణ సురక్షా` అనే స్వచ్ఛంద సంస్థ దాఖ‌లు చేసిన పిటిషన్‌పై విచారణ జ‌రిపిన జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్‌.. భారీ జ‌రిమానా కొర‌డా ఝ‌ళిపిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒక్క‌సారిగా స‌ర్కారు ఉలిక్కిప‌డే ప‌రిస్తితి వ‌చ్చింది.  ఎందుకంటే.. ప్ర‌భుత్వ‌మే ఒక‌వైపు.. అప్పులు చేసుకుని.. ముందుకు సాగుతున్న ప‌రిస్థితి ఉంది. ఇలాంటి స‌మ‌యంలో రెండు మాసాల్లో..  ఏకంగా 3800 కోట్ల‌ను జ‌రిమానాగా క‌ట్టాల‌ని ఆదేశించ‌డం.. సంచ‌ల‌నంగా మారింది.

ఏం జ‌రిగింది?
ఉమ్మ‌డి రాష్ట్రంలో 1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని  సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిని సుప్రీం కోర్టు  2014లో ఎన్జీటీకి బదిలీ చేసింది. రాష్ట్రంలోని 351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్య నివారణపైనా, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. అదేవిధంగా ఇసుక  అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై  చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థ పిటిషన్ లో పేర్కొంది.

ఈ రెండు విషయాలపై ప్రస్తుతం విచారణ చేప‌ట్టిన జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్‌.. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై సుప్రీం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.

ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణ కోరింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శిని కూడా విచారించింది. అయితే.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యదర్శి ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని హరిత ట్రిబ్యునల్‌.. తాజాగా జరిమానా విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు.. డిపాజిట్ చేయ‌ని ప‌క్షంలో ధిక్క‌రణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది.
 
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News