ఇంటర్వ్యూలో వయసు అడిగిన పాపానికి మహిళకు రూ.4 లక్షలు

Update: 2022-08-20 23:30 GMT
ఆడదాని వయసు.. మగాడి జీతం అడగకూడదన్నది ఓ సామెత. కానీ ఏకంగా ఇంటర్వ్యూలో ఓ మహిళను వయసు అడిగింది ఓ పిజ్జా కంపెనీ.. దానికి భారీ మూల్యం చెల్లించుకుంది.ఇంటర్వ్యూలో ఓ మహిళ వయసు అడిగి బుక్కైంది డొమినోస్ సంస్థ. ఇంటర్వ్యూకు పిలిచిన జానిస్ వాల్ష్ కు క్షమాపణ చెప్పడమే కాకుండా దాదాపు 4 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఉత్తర ఐర్లాండ్ లోని కౌంటీ టైరోన్ లోని స్ట్రబేన్ లో ఉన్న డోమినోస్ పిజ్జా బ్రాంచ్ లో డెలివరీ డ్రైవర్ పోస్టు కోసం జానిస్ ఇంటర్వ్యూకు వెళ్లింది.

ఇంటర్వ్యూ చేసిన అధికారులు తొలి ప్రశ్నగానే ఆమెను ‘మీ వయసు ఎంత?’ అని ప్రశ్నించారు. తనను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఆమె తన వయసు చెప్పగానే ఆయన ఓ పేపర్ పై రాసుకొని దానిని గుండ్రంగా మార్క్ చేశాడు. దీంతో ఈ ఉద్యోగం రాదని ఆమెకు అర్థమైపోయింది.

వయసు ఎక్కువ కావడంతోపాటు మహిళను కావడం వల్లే తనకు ఉద్యోగం తిరస్కరించినట్టు ఆమె గుర్తించింది. ఇంటర్వ్యూ పానెల్ కు నా వయసు ప్రభావం చూపిందని జానిస్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న వివక్ష గురించి ఫేస్ బుక్ ద్వారా డొమినోస్ బ్రాంచ్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ వెంటనే ఆమెకు డోమినెస్ సారీ చెప్పింది.  ఇంటర్వ్యూలో వయసు అడగకూడదన్న విషయం వారికి తెలియదని డోమినోస్ వివరణ ఇచ్చింది.  మహిళ అయినందునే డ్రైవర్ పోస్టుకు తీసుకోలేదని కూడా చెప్పింది. దీంతో జానిస్ తనకు ఎదురైన వివక్షపై కోర్టును ఆశ్రయించింది.

ఈక్వాలిటీ కమిషన్ ఆమెకు అండగా నిలిచింది. డోమినోస్ పిజ్జా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఉపాధి, ఉద్యోగం వంటి బాధ్యతలు బ్రాంచీవేనని స్పష్టం చేసింది. అన్ని ఫ్రాంచైజీలు ఒకే మోడల్ ను ఫాలో అవుతాయని.. ఇక్కడ తప్పు జరిగిందని డోమినోస్ వివరణ ఇచ్చింది. రూ.4 లక్షలు ఆమెకు చెల్లించింది.
Tags:    

Similar News