పాత నోట్లు ఉన్నాయా..నాలుగేళ్ల జైలు

Update: 2016-12-28 07:51 GMT
పెద్దనోట్ల రద్దు అనంతరం.. వరుసబెట్టి కొత్త నిర్ణయాల్ని తీసుకుంటున్న మోడీ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకూ నోటి మాటగా ఉన్నది.. ఇక అధికారికం కానుంది. ఈ దిశగా కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కీలకమైన విధానాల్ని వీలైనంతవరకూ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తూ బండి లాగిస్తున్నమోడీ సర్కారు.. పాతనోట్ల విషయంలో సరికొత్త ఆర్డినెన్స్ ను విడుదల చేసింది.

మార్చి 31 తర్వాత రద్దు అయిన నోట్లు ఎవరైనా కలిగి ఉంటే.. వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఆర్డినెన్స్ జారీ చేయాలన్న కీలక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికీ బయటకు రాని పెద్దనోట్ల బయటకు రావటంతో పాటు..పాతనోట్లను అక్రమంగా దాచి ఉంచాలన్న ఆలోచనకు తెర దించేలా చేశారని చెప్పాలి. పెద్దనోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి కేంద్రం డిసెంబరు 30 వరకు గడువు విధించింది.

అయితే.. డిసెంబరు 30 తర్వాత తమ వద్ద ఉన్న పాత నోట్లను రిజర్వ్ బ్యాంకులో కేవైసీ వివరాలు వెల్లడించి.. నగదును మార్చుకునే వీలుంది. దీనికి తుది గడువుగా మార్చి 31వరకూ మాత్రమే ఉంది. ఆ తర్వాత కూడా పాతనోట్లు కలిగి ఉండటాన్ని నేరంగా పరిగణించాలని మోడీ సర్కారు నిర్ణయం తీసుకుంది. పాత నోట్లను మార్చి 31 తర్వాత ఉంచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలా నోట్లు ఉన్న వారికి నాలుగేళ్ల జైలుశిక్ష వేసేందుకు వీలుగా ఆర్డినెన్స్ తెచ్చేందుకు మోడీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక.. ఈ అంశంపై ఆర్డినెన్స్ విడుదల చేయటం అధికారికం మాత్రమే అవుతుందని చెప్పొచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News