6 వారాలు..4900 కోట్లు డ్రా చేసుకున్నారు!

Update: 2018-06-26 04:39 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చోటు చేసుకోని స‌న్నివేశం ఈసారి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న రైతుబంధు ప‌థ‌కం ఒక కొత్త‌త‌ర‌హా వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. కేవ‌లం ఆరు వారాల వ్య‌వ‌ధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు అందించిన పెట్టుబ‌డి సాయం ఇప్పుడు రైతులంద‌రి చేతుల్లోకి చేరింది. కేవ‌లం 42 రోజుల స్వ‌ల్పవ్య‌వ‌ధిలో ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల‌కు దాదాపు ఐదు వేల కోట్ల వ‌ర‌కూ మొత్తం చేర‌టం ఇదే తొలిసారిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

గ‌డిచిన ఆరు వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎక‌రానికి ఎనిమిది వేల చొప్పున రైతుబంధు సాయం అందించే క్ర‌మంలో తొలివిడ‌త‌గా రూ.4వేలు చొప్పున ప్ర‌భుత్వం చెక్కులు పంపిణీ చేసింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో బ్యాంకుల నుంచి రైతులు ఇంత భారీ మొత్తాన్ని విత్ డ్రా చేయ‌టాన్ని ఆల్ టైం రికార్డుగా చెబుతున్నారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు వేళ‌.. క‌రెన్సీ క‌ట‌క‌ట చోటు చేసుకుంటే.. తాజాగా మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలా కుటుంబాల్లో కొత్త‌గా వ‌చ్చిన మొత్తం కరెస్నీ నోట్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న 10558 గ్రామాల్లో 58 ల‌క్ష‌ల మంది రైతుల‌కు పంపిణీ చేసేందుకు 57.88 ల‌క్ష‌ల చెక్కుల్ని ప్రింట్ చేయించింది. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కూ 40.94 ల‌క్ష‌ల చెక్కులు విత్ డ్రా అయిన‌ట్లు ప్ర‌భుత్వం చెబుతోంది.

ఊళ్లో లేని వారు.. ఉపాధి కోసం విదేశాల‌కు వెళ్లిన వారు.. ఆర్మీలో ప‌ని చేస్తున్న వారు.. ఇలాంటి కార‌ణాల‌తో దాదాపు 16.94 చెక్కుల పంపిణీ పూర్తి కాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పంట సాయం కింద అందిన మొత్తాన్ని రైతులు ఏం చేస్తున్నార‌న్న అంశంపై ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌స్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఒకేసారి ఇంత మొత్తం ప్ర‌భుత్వం నుంచి అందుకోని వ్య‌వ‌సాయ కుటుంబాలు.. ప్ర‌భుత్వం అందించిన పెట్టుబ‌డి సాయాన్ని వేర్వేరు ప‌నుల కోసం వినియోగిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.కొంత‌మంది రైతులు మాత్రం ప్ర‌భుత్వం ఏ ఉద్దేశంతో న‌గ‌దును అందించిందో.. దాని కోసం వినియోగించాల‌ని ఫిక్స్ కాగా.. ఇంకొంద‌రు రైతులు మాత్రం ఈ మొత్తాన్ని ఫిక్సెడ్ డిపాజిట్ గా బ్యాంకుల్లో మ‌దుపు చేయ‌టం.. ఇంట్లో స‌రికొత్త‌గా ఎల‌క్ట్రిక‌ల్ ఉప‌క‌ర‌ణాలు కొనుగోలు చేయ‌టం కోసం వినియోగిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

చేతికి వ‌చ్చిన మొత్తంలో ఎక్కువ భాగాన్ని తిరిగి ఖ‌ర్చు చేసేందుకు మొగ్గు చూప‌టంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు స‌రికొత్త సీన్ ఆవిష్కృత‌మ‌వుతోంది. కొనుగోళ్లు.. అమ్మ‌కాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్న ప‌రిస్థితి. సాధార‌ణంగా పెద్ద పెద్ద పండ‌గ‌ల స‌మ‌యాల్లో ఎలాంటి సంద‌డి క‌నిపిస్తుందో.. రైతుబంధు ప‌థ‌కం పుణ్య‌మా అని ఇప్పుడు గ్రామాల్లో అలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.
Tags:    

Similar News