ఈ రోజు తాలిబన్ల చేసిన 5 దారుణాలు

Update: 2021-08-21 00:30 GMT
రాక్షసులు.. పిశాతులు స్వభావ రీత్యా ఎలాంటివో అందరికి తెలిసిందే. వారికి మంచి.. చెడు అన్న తేడా ఉండదు. కేవలం కాల్పనిక కథల్లో.. సినిమాల్లో మాత్రమే అప్పుడప్పుడు కాస్తంత మంచితనాన్ని అపాదిస్తుంటారు. ఈ భూమి మీద రాక్షసులుగా.. పిశాచాలుగా అభివర్ణించే తాలిబన్లు మారారంటే అంతకు మించిన కామెడీ మరొకటి ఉండదన్న విషయాన్ని తాజాగా వారి చేష్టలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. గతానికి భిన్నంగా మాటలు నేర్చిన వారు.. మాటల్లో మాత్రమే సుద్దులు వల్లిస్తున్నారు.

చేతలకు వచ్చేసరికి మాత్రం వారి దారుణాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఇవాల్టికి బయటకు వచ్చిన దారుణాల్లో టాప్ 5 దారుణాల్ని చూస్తే.. అర్థమవుతుంది వారి దారుణాలకు అంతే లేకుండా పోతుందని. ఇంతకీ ఆ ఐదు ఏమిటంటే..

1. సాధారణంగా దేశం ఏదైనా తమ దేశంలోని పరాయి దేశానికి సంబంధించిన కాన్సులేట్ జోలికి వెళ్లే ధైర్యం చేయరు. కానీ.. తాలిబన్ల రూటు సపరేటు కదా. తాజాగా వారు అఫ్గాన్ లోని కాందహార్.. హెరాత్ లలో ఉన్న ఇండియన్ కాన్సులేట్ లో తనిఖీలు నిర్వహించటం సంచలనంగా మారింది. నిజానికి ఈ ఆరాచకం జరిగి రెండు రోజులైందని.. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. కాన్సులేట్ కు వచ్చిన వారు కొన్ని పత్రాల్ని.. వాహనాల్ని కూడా తమ వెంట తీసుకెళ్లారు. కాన్సులేట్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.

2. అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత మొత్తం పరిస్థితులు మారిపోయాయి. మార్పు అన్నది ఎక్కడో కాదు.. ప్రజల దుస్తులతోనే మొదలైంది. తాలిబన్ల రాకకు ముందు వరకు జీన్స్ తో పాటు తమకు నచ్చిన దుస్తుల్ని ధరించిన ప్రజలు ఇప్పుడు వాటిని బయటకు తీయటానికే బయపడుతున్నారు.మొత్తం సంప్రదాయ దస్తుల్లోకి మారిపోయారు. భయం భయంగా గడుపుతున్నారు. అంతేకాదు.. తాము సంప్రదాయవాదులమని చెప్పుకోవటానికి గడ్డం పెంచాల్సి వస్తోంది. కాబూల్ లో మహిళలు హిజాబ్ చాలా తక్కువగా ధరించేవారు. ఇప్పుడు అది లేకుండా బయటకు రావటం లేదు.

3. అఫ్గాన్ లోని ఒక చానల్ లో పని చేసే పాత్రికేయురాలు చేసిన ట్వీట్ ఇప్పుడు ఆ దేశంలోని పరిస్థితులు ఏమిటన్న విషయాన్ని అర్థమయ్యేలా చేస్తున్నాయి. తాను పని చేస్తున్న టీవీ చానల్ లో తనను ఉద్యోగానికి అనుమతించటం లేదని పేర్కొంది. తన వద్ద కంపెనీ ఐడీ కార్డు ఉన్నప్పటికీ అనుమతించటం లేదని.. పురుష ఉద్యోగుల్ని మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పాత్రికేయురాలు ప్రభుత్వం అధీనంలో పని చేస్తున్న చానల్ లో పని చేస్తున్నారు.

4. తాలిబన్లకు వ్యతిరేకంగా పని చేసేవారి కోసం జల్లెడ వేసుకొని మరీ గాలిస్తున్నట్లుగా చెబుతున్నారు. డీడబ్ల్యూ అనే అంతర్జాతీయ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుల కోసం వారు ప్రతి ఇంటిని గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పాత్రికుయుడి బంధువును తాలిబన్లు కాల్చి చంపినట్లుగా తెలుస్తోంది అఫ్గాన్ లో మీడియా సిబ్బంది ప్రమాద అంచుల్లో ఉన్నారనటానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు.

5. లొంగిపోతే ప్రాణాలతో మిగులుతారు. లేకుంటే చచ్చిపోతారు. తాజాగా తాలిబన్ల భారీ ఆఫర్ ఇది. గతంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారంతా వారికి వారుగా బయటకు రావాలని వారు చెబుతున్నారు. మొన్నటికి మొన్న తాలిబన్లు అఫ్గాన్లలందరికి క్షమాభిక్ష పెట్టినట్లుగా చెప్పినప్పటికీ.. అదంతా ఉత్తుత్తే అన్న విషయం తేలిపోయింది. గతంలో నాటో దళాలకు సహకరించిన వారి కోసం వేట మొదలైనట్లుగా చెబుతున్నారు. నాటో కూటమికి సాయం చేసిన వారు లొంగిపోకుంటే.. వారి కుటుంబ సభ్యుల్ని మట్టుబెడతామని చెబుతూ.. ఇంటింటిని వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News