ఆ సంస్థలో వేధింపులు...సీఈఓకి 500 మంది బహిరంగ లేఖ !

Update: 2021-04-12 13:30 GMT
గూగుల్ .. ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం. గూగుల్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఓ భాగమైంది. గూగుల్ లేనిదే అడుగు తీసి ముందుకు పెట్టలేని విధంగా తయారైంది. అయితే , ఈ ప్రముఖ సంస్థలో ఉద్యోగులపై వేధింపులు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయట. దీనితో వెంటనే మా ఈ సమస్య ను పరిష్కరించండి అంటూ గూగుల్ సీఈఓకి  500 మంది ఉద్యోగులు బ‌హిరంగ లేఖ రాశారు. తక్షణమే మమ్మల్ని ,ఆదుకోవాలని , ఈ సమస్య కి తగిన విధంగా ముగింపు పలకాలని కోరారు. న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో గూగుల్ సంస్థ‌లో జ‌రుగుతున్న వేధింపుల‌పై ఆ సంస్థ‌ మాజీ ఇంజినీర్ ఎమీ నీట్ ‌ఫీల్డ్ ఒక ఆర్టిక‌ల్ ప్ర‌చురిత‌మైన త‌ర్వాత ఉద్యోగులు ఈ లేఖ రాసిన‌ట్లుగా వార్తలు వస్తున్నాయి.

500 మంది ఉద్యోగులు ఒక్కసారిగా సీఈఓ కి బహిరంగ లేఖ రాయడంతో  ఐటీ రంగంలో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్ ‌గా మారింది. గూగుల్ సంస్థ ‌లో పనిచేసిన తర్వాత నాకు ఏ రోజూ కూడా మళ్లీ జీవితంలో ఉద్యోగం చేయాలనిపించలేదు అనే శీర్షికన ఎమీ నీట్ ‌ఫీల్డ్‌ తన అనుభవాలను వెల్లడించారు. అలాగే తనకి ఇష్టం లేదు అని చెప్తున్నా కూడా వారితోనే ముఖాముఖి పెట్టేవారని , వారి పక్క సీట్లోనే కూర్చోబెట్టేవారని ,ఈ  విష‌యాన్ని ఉన్న‌తాధికారులకు చెబితే , కౌన్సెలింగ్ కోర‌వ‌చ్చు లేదంటే ఇంటి నుంచి ప‌నిచేయ‌వ‌చ్చు, అది కుదరదు అనుకుంటే  సెల‌వుపై వెళ్ల‌వ‌చ్చు అని చెప్ప‌డం వేధింపులకి వత్తాసు పలికినట్టే అని చెప్పారు.

ఈ అనుభవం తనకి మాత్రమే జరిగింది కాదు అని ,అంతకుముందు వేధింపులకు గురైన అనేక మంది విషయంలోనూ గూగుల్‌ ఇలాగే ప్రవర్తించినట్లు తెలిసిందని వివరించారు. 2018 లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, వేధింపుదారుల రక్షణకు వ్యతిరేకంగా 20,000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా ఆ తర్వాత కూడా సంస్థ తన పనితీరును మాత్రం మార్చుకోలేదని , గూగుల్ వాకౌట్ డిమాండ్లను ఏవీ తీర్చలేదని లేఖలో వెల్లడించింది. కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులు కంపెనీని కోరుతున్నారు. ఇదిలా ఉంటే .. దీనిపై గూగుల్ స్పందిస్తూ తమ సంస్థ మాత్రం ఉద్యోగుల ఆందోళనలపై విచారణ తీరును మెరుగుపర్చుకున్నామని  ప్రకటనలో వెల్లడించింది.
Tags:    

Similar News