షెడ్యూల్ ఎఫెక్ట్‌!... సెల‌వు రోజున బాబు 58 జీవోలు!

Update: 2019-03-10 14:44 GMT
కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన్ని రాజకీయ పార్టీల‌కు ఊహించ‌ని షాకిచ్చింది. ముంద‌స్తు స‌మాచారం లేకుండా... అది కూడా ఆదివారం సెల‌వు రోజున సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించేసింది. ఫ‌లితంగా సెల‌వు రోజు అయినా కూడా దేశవ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. నిన్న‌టి దాకా సోమ‌, లేదంటే మంగళ వారాల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డుతుంద‌ని అంతా భావించారు. అయితే కొంద‌రు మాత్రం ఆదివారం అయిన‌ప్ప‌టికీ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి షెడ్యూల్ విడుద‌ల ఖాయ‌మేన‌ని అంచనాలు వేశారు. అయితే ఈ కొంద‌రు అనుకున్న‌ట్టుగానే కేంద్ర ఎన్నిక‌ల సంఘం సెల‌వు రోజు అయిన‌ప్ప‌టికీ ఆదివారమే సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్‌ ను విడుద‌ల చేసింది. ఈసీ ఇచ్చిన ఈ షాక్ దాదాపుగా అన్ని పార్టీల‌కు శ‌రాఘాతంలానే త‌గిలింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ప‌రిస్థితులు ఎంత క‌ష్టంగా ఉన్నా... త‌న‌దైన శైలిలో మంత్రాంగం తిప్పే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఈసీ ఇచ్చిన షాక్ నుంచి త్వ‌ర‌గానే తేరుకున్నార‌ని చెప్పాలి.

ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివిధ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా చాలా అంశాల‌కు సంబంధించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు చేసిన చంద్ర‌బాబు... వాటిలో చాలా వాటికి అధికారికంగా ఉత్త‌ర్వులు కూడా జారీ చేశార‌నే చెప్పాలి. అయినా ఇంకా చాలా వాటికి ప్ర‌భుత్వం నుంచి జీవోలు రావాల్సి ఉంది. కోడ్ అమ‌ల్లోకి వ‌స్తే... వాటికి సంబంధించిన జీవోలు విడుద‌ల చేయ‌డం కుద‌ర‌దు. ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యమే ఈ రోజు షెడ్యూల్ విడుద‌ల అవుతుంద‌న్న ఓ స్ప‌ష్ట‌త రాగా... చంద్ర‌బాబు అప్ప‌టిక‌ప్పుడు మొత్తం చ‌క్రం తిప్పేశారు. సెల‌వు రోజు అయినా ఉన్న‌ప‌ళంగా అధికారులంతా సెక్ర‌టేక‌రియ‌ట్‌ కు రావాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేయ‌డ‌మే కాకుండా.. వారిని కార్యాల‌యాల‌కు ర‌ప్పించేశారు. ఇంకేముంది.. ఇప్ప‌టిదాకా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి అధికారిక ఉత్త‌ర్వుల‌ను పెండింగ్ లో పెట్టిన వాట‌న్నింటికీ సింగిల్ సిట్టింగ్ లో జీవోలు జారీ చేశారు.

ఇలా సెల‌వు రోజు అయినా... సాయంత్రం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డం, ఆ వెంట‌నే కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేలోగానే చంద్ర‌బాబు... ఏకంగా 58 జీవోల‌ను జారీ చేయించేశారు. వీటిలో రైతుల రుణ‌మాఫీకి సంబంధించిన కీల‌క జీవో కూడా ఉంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో రైతుల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు... ఇప్ప‌టిదాకా విడ‌త‌ల‌వారీగా మూడు విడ‌త‌ల సొమ్మునే రైతుల‌కు అంద‌జేశారు. అయితే నాలుగు, ఐదు విడ‌త‌ల సొమ్ము ఇంకా విడుద‌ల కాలేదు. అప్పు చేసి అయినా ఈ సొమ్మును ఇచ్చేస్తామ‌ని ప్ర‌క‌టించిన చంద్రబాబు... అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఉరుము లేని పిడుగులా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల కాగా... నేటి మ‌ధ్యాహ్న‌మే ఈ రెండు విడ‌త‌ల రుణ మాఫీకి సంబందించి చంద్ర‌బాబు స‌ర్కారు అదికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంటే... ఎన్నిక‌ల షెడ్యూల్ పుణ్య‌మా అని రైతుల‌కు ఇప్పుడు నాలుగు, ఐదు విడ‌త‌ల రుణ మాఫీ సొమ్ము త్వ‌ర‌లోనే వారి ఖాతాల్లో జ‌మ కానుంద‌న్న మాట‌.
    
    

Tags:    

Similar News