5 స్థానాల‌కు 7 నామినేష‌న్లు..ఏక‌గ్రీవం సాధ్యం కాదా?

Update: 2019-03-01 06:46 GMT
తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి జ‌రుగుతున్న ఎన్నిక‌ల నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. మొత్తం ఐదు స్థానాల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఏడు నామినేష‌న్లు దాఖ‌లు అయ్యాయి. ఖాళీ ఉన్న ఐదు స్థానాల్ని త‌మ సొంతం చేసుకోవ‌టానికి వీలుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహం ప‌న్నారు. త‌న మిత్రుడు మ‌జ్లిస్ తో క‌లిపి ఐదు స్థానాల‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

మ‌రోవైపు న్యాయంగా త‌మ‌కు ద‌క్కే అవ‌కాశం ఉన్న ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా.. స్వ‌తంత్య్ర అభ్య‌ర్థి జాజుల భాస్క‌ర్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. టీఆర్ఎస్ త‌ర‌ఫున అభ్య‌ర్థులుగా హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ.. రాష్ట్ర ఖ‌నిజాభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ శేరి సుభాష్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే స‌త్య‌వ‌తి రాథోడ్‌.. తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యొగ్గె మ‌ల్లేశం.. మ‌జ్లిస్ త‌ర‌ఫున కార్పొరేట‌ర్ మిర్జా రియాజ్ ఉల్ హ‌స‌న్ లు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు.

ఇక.. కాంగ్రెస్ త‌ర‌ఫున తెలంగాణ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయ‌ణ‌రెడ్డి నామినేష‌న్ వేశారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు మార్చి ఐదో తేదీ వ‌ర‌కు గ‌డువు ఉండ‌గా.. ఇప్పుడు ఉన్న‌ట్లే బ‌రిలో ఐదుగురికి మించిన అభ్య‌ర్థులు ఉంటే ఎన్నిక మార్చి 12న జ‌రుగుతుంది.

టీఆర్ఎస్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బ‌లానికి త‌గ్గ‌ట్లుగా అభ్య‌ర్థుల్ని పోటీకి నిల‌పాల‌ని సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ కోరుతోంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌తిప‌క్షానికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో తాను అనుకున్న‌ట్లే ఐదు స్థానాలు త‌మ వ‌శం కావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఎన్నిక‌లు జ‌రిగినా.. చీలిక‌ల‌తో తాను అనుకున్న‌ది సాధించేలా వ్యూహాన్ని  రెఢీ చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఇదిలా ఉంటే కేసీఆర్ వ్యూహాన్ని దెబ్బ తీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద నిల‌బ‌డి ముఖ్య‌మంత్రికి షాకివ్వాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉండి ఓట్లు వేస్తే..సంచ‌ల‌న ఫ‌లితానికి అవ‌కాశం ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డ‌టం క‌ష్ట‌మ‌న్న మాట వినిపిస్తోంది. మ‌రోవైపు ఉపాధ్యాయ‌.. ప‌ట్ట‌భ‌ద్ర‌స్థానాల‌కు ఈ రోజు నుంచి ప‌లువురు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు.


Tags:    

Similar News