పోలీసుల‌పై కామాంధుడి కాల్పులు..

Update: 2018-10-05 06:13 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌రోమారు తుపాకుల మోత‌మోగింది. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా - ఏడుగురు గాయపడ్డారు. అంతకుముందు ఆ ఉన్మాది ఫ్లారెన్స్‌ లోని తన ఇంట్లో కొందరు పిల్లలను నిర్బంధించాడు. ఫ్లోరెన్స్  పట్టణంలోని వింటేజ్‌ ప్లేస్‌ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్‌ హాప్కిన్స్‌(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్‌ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లగా...వారిని దూరం నుంచి చూసిన  హాప్కిన్స్‌ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్‌ పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసు వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇటీవల వచ్చిన తుఫానుతో అతలాకుతలమైన ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని - ఇంతలోనే ఉన్మాది కాల్పులకు తెగబడటంతో స్థానికులు భయభ్రాంతులయ్యారని నగర పోలీస్ అధికారి మైక్ నన్ అన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మైక్‌ తోపాటు ఇతర పోలీసులు కంటతడి పెట్టారు. మృతి చెందిన పోలీస్ అధికారి టెరెన్స్ క్యారవే ధైర్యవంతుడని మరో పోలీస్ అధికారి హైడ్లర్ చెప్పారు. ఇంట్లో ఉన్న నిందితునికి వారెంట్ అందజేయడానికి తొలుత ముగ్గురు అధికారులు వచ్చారని - అతడు ఉన్మాదిగా మారి వారిపై కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. ఆ తరువాత వచ్చిన నలుగురు పోలీసు అధికారులపై కూడా కాల్పులు జరిపాడని హైడ్లర్ వివరించారు.
Tags:    

Similar News