మీ వాట్సాప్ లో ‘+91 9013151515’ ఈ నెంబరు ఎందుకు సేవ్ చేసుకోవాలంటే?

Update: 2021-08-09 04:28 GMT
కరోనా కాలం జీవితానికి సరిపడా మార్పుల్ని తీసుకురావటం తెలిసిందే. యావత్ ప్రపంచానికి సరికొత్త పాఠాల్ని నేర్పిన కరోనా మహమ్మారి దెబ్బకు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ టీకాలు వేయించుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది వ్యాక్సినేషన్ చేసుకున్నా.. ఇంకా పలువురు మిగిలే ఉన్నారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ కొరత లేకున్నా.. టీకా వేయించుకోవటానికి ప్రజలు సిద్ధంగా లేకుంటే.. చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొరత కారణంగా టీకాలు సకాలంలో వేయించుకోని పరిస్థితి. మొత్తంగా టీకా కార్యక్రమం ఎంత త్వరగా పూర్తి అయితే.. అంత వేగంగా కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకునే వీలుంది.

అయితే.. కొత్తగా వస్తున్న వేరియంట్లు.. కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటున్న వైనం ఇప్పుడు పలు దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే.. కొవిడ్  తీవ్రతను తగ్గించే వ్యాక్సిన్ వేయించుకోవటం ఇప్పుడు తప్పనిసరి అవుతోంది. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లే వారు.. విమాన ప్రయాణాలు చేసే వారు.. కళాశాల ఆడ్మిషన్లు.. హాస్టల్స్ లో ప్రవేశానికి తప్పనిసరిగా మారిన  టీకా సర్టిపికేట్ రానున్న రోజుల్లో మాల్స్.. సూపర్ మార్కెట్లతో సహా పలు చోట్ల ఎంట్రీకి పక్కాగా ఉండాల్సిన అంశంగా ఉంచుతారనటంలో సందేహం లేదు.

ప్రస్తుతం టీకా వేయించుకున్న తర్వాత మొబైల్ కు సంక్షిప్త సమాచారం రావటం.. ఆ తర్వాత కాసేపటికి వెబ్ లింకు రావటం తెలిసిందే. దాని సాయంతో టీకా సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి వస్తోంది. ఇది అందరికి అర్థమయ్యేది కాదు. పెద్దగా చదువుకోని వారు.. శ్రామికులు.. పెద్ద వయస్కులకు ఇలాంటివి కొత్త సమస్యలుగా మారతాయి. ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పేందుకు వీలుగా తాజాగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

టీకాలు వేయించుకున్న వారి సర్టిఫికేట్లను తేలిగ్గా పొందేందుకు వీలుగా.. వాట్సాప్ లోనే టీకా సర్టిఫికేట్ గా పొందేందుకు ఒక నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఫోన్ లో ‘+91 9013151515’ నెంబరును సేవ్ చేసుకుంటే సరిపోతుంది. వాట్సాప్ లో ఈ నెంబర్ కు వెళ్లి.. కొవిడ్ సర్టిఫికేట్ అని టైప్ చేస్తే చాలు.. ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన క్షణాల్లో మీకు మీ టీకా సర్టిఫికేట్ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీన్ని ఎక్కడైనా చూపించేందుకు వీలు ఉంటుంది. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ విధానం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ విధానం చాలా సులువుగా ఉన్నట్లుగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేయటం గమనార్హం. ఇంకెందుకు ఆలస్యం.. ఈ నెంబర్ ను సేవ్ చేసుకున్నారా?
Tags:    

Similar News