93 మంది అభ్యర్థులు.. 2400 సిబ్బంది.. 90 గంటల తర్వాత తుది ఫలితం

Update: 2021-03-21 05:58 GMT
హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎట్టకేలకు తేలింది. 90 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు క్రతువు ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో పాటు.. ఈసారి పోలైన ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఉండే విలక్షణత కూడా ఒక కారణంగా చెప్పాలి.

ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొన్న అధికారులు.. తాజాగా సాగిన సుదీర్ఘ ఓట్ల లెక్కింపు వేళలో మాత్రం నీరసపడిన పరిస్థితి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లెక్క తేల్చేందుకు 2400 మంది మున్సిపల్ సిబ్బంది రోజుకు మూడు షిఫ్టులతో నిర్విరామంగా సాగిన ఓట్ల  లెక్కింపు 90 గంటలకు తుది ఫలితం వెల్లడైంది.

ఇప్పటివరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడూ కూడా ఒకట్రెండు రోజులు మాత్రమే జరిగేది. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం ఏకంగా నాలుగు రోజుల పాటు సాగటం గమనార్హం. అంతేకాదు.. అభ్యర్థుల తరఫున పాల్గొన్న ఏజెంట్లతో కలిపితే.. భారీ సంఖ్యలో ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పాలి. ఇప్పటివరకు పలు ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్ నగర్ స్టేడియంలో జరిగినా.. ఇంత సుదీర్ఘంగా సాగటం మాత్రం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం రికార్డేనని చెప్పక తప్పదు. ఎందుకంటే.. పోటీ చేసిన అభ్యర్థులు.. పోలైన ఓట్లు.. భారీగా తేలిన చెల్లని ఓట్లు.. ఇలా ప్రతి అంశం కూడా ఒక రికార్డుగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News