షాకింగ్‌.. ముసలోడే కానీ మహానుభావుడు!

Update: 2022-11-02 13:30 GMT
ఎవరైనా తమ జీవితకాలంలో ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు.. మహా అయితే మూడు. ఇంకా కొన్ని మతాలు, ఆయా కులాచారాలను బట్టి నాలుగు లేదా ఐదు వివాహాలు కూడా చేసుకునే వారంటారు. కానీ ఇండోనేషియాలోని 61 ఏళ్ల వృద్ధుడు ఒకటి కాదు రెండు కాదు.. ఐదు కాదు.. ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేనా ఇప్పుడు ఏకంగా 88వ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అందులోనూ 61 ఏళ్ల వయసులోనూ తనలో ఇంకా మజా తగ్గలేదని నిరూపిస్తున్నాడు.

వివరాల్లోకెళ్తే.. ఇండోనేషియాలోని వెస్ట్‌ జావాలోని మజలెంగ్కాలో 61 ఏళ్ల ఖాన్‌ అనే వృద్ధుడు ఉన్నాడు. ఆయన 14 ఏళ్ల వయసులో  తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్‌ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పలేదని కేవలం రెండేళ్లలోనే విడాకులు ఇచ్చేశాడు.

దీంతో తాను మహిళలపై కోపం పెంచుకున్నానని 61 ఏళ్ల ఖాన్‌ చెబుతున్నాడు. అయితే మహిళలపై కోపం పెంచుకున్నప్పటికీ వారికి ఏ హాని చేయలేదని.. వారిని ఇబ్బంది పెట్టే పనులూ చేయలేదని తెలిపాడు.

మహిళలను తన మాటల ద్వారా ప్రేమించేలా చేసుకున్నానని.. తనలోని నిజాయతీ నచ్చి చాలామంది అమ్మాయిలు తనను ప్రేమించారని వెల్లడించాడు. తన తెలివితేటలతో చాలామంది మహిళలు తనను ప్రేమించేలా చేసుకున్నానని తెలిపాడు. ఇలా ఇప్పటి వరకు సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్‌ ఇలా చాలాసార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని స్థానికులు ప్లేబాయ్‌ కింగ్‌ అని పిలుస్తుంటారు. కాగా ఖాన్‌ ఒక సామాన్య రైతు.

ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న మహిళ తన మాజీ భార్యేనని 61 ఏళ్ల ఖాన్‌ వెల్లడించాడు. ఆమె తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసిలను కూడా తిరస్కరించలేనని చెబుతున్నాడు.

కాగా  87 పెళ్లిళ్లు చేసుకున్న ఖాన్‌ తనకు ఎంతమంది పిల్లలున్నారనే విషయం మాత్రం వెల్లడించలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News