మ‌రో వివాదానికి స్వామి తెర తీశారండోయ్!

Update: 2017-03-28 07:03 GMT
బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎంపీగానే కాకుండా క‌మ‌ల‌ద‌ళంలో ఫైర్ బ్రాండ్‌ గా పేరుప‌డ్డ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌ గానే నిలుస్తున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ తో పాటు దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌ను కోర్టు మెట్లెక్కేలా చేయ‌డంలో స్వామి స‌ఫ‌లీకృతుల‌య్యార‌నే చెప్పాలి. ఏ విష‌యంపై అయినా నిర్మోహ‌మాటంగా మ‌న‌సులో ఉన్న మాట‌ను చెప్పేసే స్వామి అంటే... విప‌క్షాల‌కే కాదండోయ్ స్వ‌ప‌క్షంలోని నేత‌ల‌కు కూడా ముచ్చెమ‌ట‌లు ప‌ట్ట‌క మాన‌వు. స్వామి అంటే స్వ‌ప‌క్షంలోని నేత‌లు ఎలా హ‌డ‌లిపోతారో తెలుసుకోవాలంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని అడిగితే ఇట్టే తెలిసిపోతుంది. ఇదంతా ఒక ఎత్తైతే... హిందూత్వ పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ నేత‌గా ఉన్న స్వామి కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా తాజాగా ఆయ‌న చేసిన ఓ కామెంట్ పెద్ద చ‌ర్చ‌కే తెర తీసేలానే ఉంది.

మ‌సీదుల‌ను కూల్చివేయొచ్చు గాని హిందూ ఆల‌యాల‌ను కూల‌దోయ‌లేమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదేంటీ... మసీదుతో పాటు గుడి కూడా మ‌నిషి క‌ట్టిన నిర్మాణాలే క‌దా అంటే... అదేమీ కాదంటారు స్వామి. గుడిని ఎందుకు కూల్చేయ‌లేమో కూడా స్వామి సెల‌విచ్చారు. అదేంటంటే... ఆల‌యంలోని విగ్ర‌హంలో దేవుడు ప్ర‌తిష్ఠితమై ఉంటాడ‌ట‌. అదే మ‌సీదు అయితే కేవ‌లం ముస్లింలు ప్రార్థ‌న‌లు జ‌రుపుకునేందుకే నిర్మించుకుంటార‌ని ఆయ‌న త‌న‌దైన శైలిలో అస‌లు కార‌ణాన్ని వెల్ల‌డించారు. ఈ కార‌ణంగానే మ‌సీదును కూల్చివేసినా ఫ‌ర‌వా లేదు గానీ... గుడిని మాత్రం కూల్చేయ‌లేమ‌ని స్వామి చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ మిశ్ర‌మ ఫ‌లితాల‌ను సాధించినా... కీల‌క రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చాలా కాలం త‌ర్వాత తిరిగి పాల‌నా ప‌గ్గాలు చేజిక్కించుకుంది. అంతేకాకుండా... ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా హిందూత్వ వాదిగా పేరుప‌డ్డ ఆదిత్య‌నాథ్ యోగిని ఎంపిక చేయ‌డంతో బీజేపీ.. బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇక రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని కోరుతూ ఏడాది క్రిత‌మే స్వామి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. యోగి యూపీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేప‌థ్యంలో రామ మందిరం నిర్మాణానికి బీజేపీ వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్న క్ర‌మంలో స్వామి తాజా వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇక యోగి ప‌నితీరుపై మాట్లాడిన స్వామి... చెప్పిందే చేయ‌డం, చేసేదే చెప్పుకోవ‌డ‌మ‌నే ప్ర‌త్యేక ల‌క్ష‌ణ‌మున్న యోగి అద్భుతంగా రాణిస్తార‌ని చెప్పారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News