ఖ‌మ్మం పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్‌.. ఏం జ‌రుగుతోందంటే

Update: 2022-06-19 01:30 GMT
తెలంగాణ‌లోని కీల‌క‌మైన ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప్రస్తుత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. ‘ఓట్ల ప్రచారానికి కాదేదీ అనర్హం’ అన్నట్లు ప్రజలకు దగ్గరయ్యేందుకు నాయకులు కొత్త కొత్త పద్దతుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. ‘హాలో అన్నా.. నమస్తే.. మనదగ్గర ఇవాళ, రేపు ఏమైనా పెళ్ళిళ్లు, చావులు, దినాలున్నాయా?’ అంటూ కొందరు నాయకుల తమ అనుచరులకు ఫోనలు చేయడం.. ప‌రిపాటిగా మారింది. ఇక‌, ఇదే అదునుగా అనుచ‌రులు నాయ‌కుల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు స్థానికంగా వాకబు చేసి తమ లీడర్లకు స‌మాచారం అందిస్తున్నారు.

దీంతో కార్య‌క్ర‌మం ఏదైనా.. సదరు కార్యక్రమాల నిర్వాహకులు పిలిచినా.. పిలవకున్నా కొందరు నాయకులు మందీ మార్బలంతో వేడుకలకు హుజరై ఫోటోలు దిగడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఇప్పుడు పొలిటికల్‌ ట్రెండ్‌గా మారింది. గ్రామాల్లో నలుగురిని కూడగట్టుకోవడం లాంటి కార్యక్రమాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఊపందుకున్నాయి.  ప్ర‌స్తుతం జిల్లాలో రాజ‌కీయాలు వేడెక్కాయి. దీంతో నేత‌ల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు నాయ‌కులు హ‌డావుడి చేస్తున్నారు. ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వారు వ‌దులుకోవ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే గత కొద్ది రోజులుగా పెళ్లిళ్లు, చావులు, కర్మల వద్ద వివిధ పార్టీల నాయకుల హడావుడి ఎక్కువైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న ఆశావాహులు తమకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేకున్నా అనుచరులతో కలిసి వెళ్లి పలు శుభకార్యాల వద్ద హల్‌చల్‌ చేస్తున్న తీరును చూసి ప్రజలు విస్తుపోతున్నారు. అయితే అలా శుభకార్యాలకు వెళుతున్న లీడర్లు, ఆశవాహులు సంబంధిత కుటుంబాలకు ఏమైనా కట్నాలు, కానుకలు గానీ చావులకు, కర్మలకు ఆర్థిక సహాయం గానీ అందిస్తున్నారా అంటే అదేమీ ఉండదు.

ఏడాది క్రితం మృతి చెందిన వారి ఇళ్లకు సైతం పరామర్శల పేరిట నేతలు పోలోమంటూ క్యూకడుతున్న తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కొసమెరుపు ఏంటంటే పిలువకుండానే వేడుకలకు హాజరవుతున్న  నాయకులు, ప్రజాప్రతినిధులు తమవెంట భారీ వాహన శ్రేణులతో అనుచరులను తీసుకొని రావడంతో భోజన సౌకర్యాలు అంచనాలు మించి పోవడంతో కనీసం తమ బంధుమిత్రులకు సైతం సరిగా భోజనాలు అందిచలేకపోతున్నామని ఇటీవల పెళ్ళిళ్లు చేసిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు(ఇక్క‌డ కాంగ్రెస్‌-టీఆర్ ఎస్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంది) నియోజకవర్గంలో ఈ తరహా రాజకీయ కార్యక్రమాలు ఉధృతమయ్యాయి.

చిన్న లీడర్లు మొదలు నియోజకవర్గంపై కన్నేసిన స్థానికేతర ఆశాహులు కూడా పెళ్లిళ్లు పేరంటాల వద్ద హడావుడి చేస్తున్నారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయన్న ఆశతో ఇల్లెందు నియోజకవర్గంపై కన్నేసిన నాయకులు తీవ్ర హడావుడి చేస్తున్నారు.

స్థానిక టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఆశావాహులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన కొందరు కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మందీమార్బలంతో  ఠారెత్తిస్తున్నారు.  టీఆర్ ఎస్‌కు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మనలు, కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది చోటామోటా లీడర్లు రెండు నెలలుగా గ్రామాల్లో సందడి చేస్తున్నారు.  దీంతో జిల్లాలో కొత్త పొలిటిక‌ల్ ట్రెండ్ న‌డుస్తోంద‌నే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News