టీయారెస్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు...?

Update: 2022-11-02 04:59 GMT
టీయారెస్ మునుగోడు ఉప ఎనికల వేళ ఒక రాజకీయ రాధ్ధాంతాన్ని  సృష్టించింది. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఫాం హౌస్ పేరిట కొనుగోలు చేయడానికి చూశారంటూ రచ్చ రచ్చ చేసింది. కొద్ది రోజుల పాటు బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. అయితే ఈ ఇష్యూ రాజకీయంగా టీయారెస్ కి అనుకున్నంతగా మైలేజిని ఇవ్వలేదు. అదే టైం లో బీజేపీకి కొంత వరకూ డ్యామేజ్ చేసింది. అది బీజేఆపీకి కీలకమైన సమయాన ఇరుకునపెట్టింది. ఆ బాధ వారికి టీయారెస్ మీద కోపంగా మారుతోంది.

ఆ సంగతి అలా ఉంచితే బీజేపీ కీలక నేతల నుంచి ఒక మాదిరి నేతల వరకూ అందరి ఫోన్లను టీయారెస్ సర్కార్ ట్యాప్ చేసింది అని బీజేపీ కేంద్ర పెద్దలే అనుమానిస్తున్నారు. దాంతో పాటు బీజేపీకి చెందిన తెలంగాణా వ్యవహారాల ఇంచార్జి తరుణు చుగ్ లాంటి వారు ఇప్పటికే దీని మీద ఈసీకి ఫిర్యాదు చేశారు. మరో వైపు బీజేపీకి చెందిన సానుభూతిపరుడొకరు దీని మీద హై కోర్టులో కేసు ఫైల్ చేస్తే అది ఈ నెల 4న విచారణకు రానుంది.

ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్ధిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ బ్యాంక్ అకౌంట్ల గుట్టును  టీయారెస్ నేతలు లాగారు. అక్కడ నుంచి డబ్బు ఎవరెవరికి వెళ్ళింది అన్న దాని మీద కూడా వివరాలు సేకరించారు. మరి ఈ వివరాలు అన్నీ టీయారెస్ నేతలకు ఎలా తెలిశాయి అంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అని అంటున్నారు.

దాంతో పాటు ఫాం హౌస్ ఆపరేషన్ విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ పెద్దలు అనుమానిస్తున్నారుట. వీటికి సంబంధించి అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అవడంతోనే వీటిని బయటకు తీసి కేసీయార్ వ్యవహారం ఏంటో చూస్తామని అంటున్నారు.

నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే అది చాలా పెద్ద కేసు అవుతుంది. అప్పట్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నం చేశారు అని టీయారెస్ ఆరోపించింది. అపుడు కూడా టీడీపీ  నుంచి తమ ఫోన్లను టీయారెస్ ట్యాప్ చేసింది అని ఆరోపణలు వినిపించాయి.

అయితే అది రెండు రాష్ట్రాలకు చెందిన విషయం కాబట్టి తరువాత ఆగిపోయింది. కానీ ఇపుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితురాలిగా బీజేపీ ఉంది. పైగా కేంద్రంలో అధికారంలో ఉంది. దాంతో ఈ వ్యవహారాన్ని అసలు వదిలిపెట్టదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీయారెస్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చుకుని బిగించడానికి బీజేపీ రెడీ అవుతోంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News