మూడో ప్ర‌పంచ యుద్ధం ముంచుకొస్తుందా?

Update: 2018-04-15 05:48 GMT
రెండు ప్ర‌పంచ య‌ద్దాల్ని చూసిన ప్ర‌పంచం మూడో ప్ర‌పంచ యుద్ధం కానీ మొద‌లైతే.. మిగిలేదీ ఏమీ ఉండ‌ద‌న్న మాట గ‌త కొన్నేళ్లుగా వింటున్న‌దే. ఆ మ‌ధ్య వ‌ర‌కూ మూడో ప్ర‌పంచ యుద్ధ భ‌యాలు ఉన్న‌ప్ప‌టికీ.. అవేవీ సాధ్యం కాద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వినిపించేవారు. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో మూడో ప్ర‌పంచ యుద్ధం ముంచుకొచ్చేస్తుంద‌న్న సంచ‌ల‌న వార్త‌ను ర‌ష్యా ప్ర‌భుత్వ మీడియా సంస్థ ప్ర‌సారం చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

సిరియా పై అమెరికా మిత్ర‌ప‌క్షాలు క్షిప‌ణుల వ‌ర్షం కురిపిస్తున్న వేళ‌.. ర‌ష్యా అధికారిక మీడియా సంస్థ రోష్నియా-24 చేసిన ప్ర‌క‌ట‌న షాక్ కు గురి చేయ‌టంతో పాటు.. ప్ర‌పంచం ఉలిక్కిపడేలా చేసింది.  సిరియా సంక్షోభం మూడో ప్ర‌పంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ప్ర‌జ‌లు త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌టానికి సిద్ధంగా ఉండాలంటూ సూచ‌న‌లు చేసింది.

బాంబు షెల్ట‌ర్ ల‌లో ఉంటున్న వారు ఐయోడిన్ ప్యాకెట్ల‌ను ద‌గ్గ‌ర్లో ఉంచుకోవాల‌ని.. రేడియేష‌న్ కు గురి కాకుండా అయోడిన్ ను శ‌రీరానికి రాసుకోవాల‌న్నారు. ఆహార ప‌దార్థాల్ని కూడా సిద్ధం చేసుకోవాల‌ని.. పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంచుకోవ‌టం అవ‌స‌ర‌మ‌న్నారు.

బియ్యం.. ఓట్స్ లాంటి వాటిని దాచిపెట్టుకోవ‌టం ద్వారా వాటిని ఎక్కువ కాలం వినియోగించుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. సిరియా అంత‌ర్యుద్ధంలో భాగంగా తాజాగా ప్ర‌పంచం రెండో మిస్సైల్ క్రైసిస్ ను ఎదుర్కొంటోంద‌ని పేర్కొంది. తొలి కోల్డ్ వార్ తో పోలిస్తే.. తాజాగా వార్ మ‌రింత భ‌యంక‌రంగా.. ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. రోష్నియా -24 ప్ర‌సారం చేసిన ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
Tags:    

Similar News