`సర్వం ఆధార్ మయం చేసేశారు..అన్నింటికీ ఆధార్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం` అంటూ కొందరు ఆక్షేపిస్తుండగా...ఇంకొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ...ప్రభుత్వం ఏమాత్రం తగ్గకుండా ఆధార్ తప్పనిసరి చేస్తోంది. అలా చేయడం వల్లే...తాజాగా 80 వేల మంది దొరికిపోయారు. దొరికిపోయారు అంటే... అడ్రస్ దొరకడం కాదు. వారు నకి`లీలలు` దొరికిపోయాయి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటు ఉపాధ్యాయులు..అటు విద్యార్థుల లెక్కలు తీయడంలో భాగంగా ఆధార్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు - అనుబంధ కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు - చదువుకునే విద్యార్ధులు తప్పనిసరిగా ఆధార్ ను సమర్పించాలని కోరింది. దాదాపు ఆరునెలల పాటు సాగిన ఈ ప్రకియలో ఆధార్ వివరాలు ఆయా విద్యాసంస్థలు సమర్పించాయి. వీటిని క్రోడీకరించగా...అవాక్కయ్యే అంశాలు వెల్లడయ్యాయి. దాదాపు 80 వేల మంది ఉపాధ్యాయులు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పనిచేస్తున్నట్లు తేలింది. అంటే 80,000 మంది నకిలీలను ఆధార్ పట్టించిందన్నమాట.
భారీ స్థాయిలో బయటపడ్డ నకిలీలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ ఆధార్ తో పెద్ద ఎత్తున నకిలీల జాబితా బయటపడిందన్నారు. 80,000 నకిలీ ఉపాధ్యాయుల జాబితాలో తమ శాఖ ఆధీనంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పని చేసేవారు ఎవరూ లేరని తెలిపారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ మంది ఉన్నారని వివరించారు. ఆధార్ విషయంలో అనేక అపోహలు వద్దని అన్నారు. మన మొబైల్ నంబర్ ఎలా ఇతరులతో పంచుకుంటున్నామో ఆధార్ అంతేనని వివరించారు. ఆధార్ నంబర్ ఇస్తే వ్యక్తిగత సమాచారం అంతా తెలుస్తోందన్న అపోహలను నమ్మవద్దని కేంద్ర మంత్రి కోరారు.