రెండిళ్ల పూజారులను పట్టిస్తున్న ఆధార్ కార్డులు

Update: 2016-06-06 09:55 GMT
దేశంలో ఆధార్ ప్రోగ్రాం చేపట్టినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇదెన్నాళ్లు ఉంటుందన్నారు... జనానికి ఇబ్బంది వస్తుందన్నారు.. అన్నిటికీ ఆధార్ కార్డు కావాలంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.. చివరికి కోర్టులు కూడా ఆధార్ తప్పనిసరి కాదన్నాయి. కానీ.. ఎవరెన్ని అనుకున్నా ఆధార్ మాత్రం అన్నిటికీ తప్పనిసరి అయిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్ధిపొందడంలో ఇది కీలకంగా మారింది. అంతేకాదు.. ఎవరైనా అవకతవకలకు పాల్పడి రెండు రెండు సార్లు ప్రయోజనాలు పొందితే ఆధార్ దెబ్బకు దొరికిపోతున్నారు. అంతెందుకు రెండు గ్యాస్ కనెక్షన్లున్నా కూడా తెలిసిపోతుంది. సిమ్ కార్డులు - బ్యాంకు అకౌంట్లు అన్నిటికీ ఆధారే ఆధారం. అలాంటి ఆ ఆధార్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కథను కూడా బయటపెట్టేసింది. అవును.. ఆధార్ దెబ్బకు ఓ వ్యక్తి సెకండ్ ఫ్యామిలీ గుట్టు రట్టయిపోయింది.
    
తన భార్యకు తెలియకుండా, ఇంకో యువతిని వివాహం చేసుకుని, ఇద్దరితోనూ కాపురం చేస్తున్న దొంగమొగుడి వ్యవహారం ఆధార్ పుణ్యమాని బట్టబయలైన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ములకలచెరువుకు చెందిన ఓ యువతి రేషన్ కోసం వెళ్లగా, ఐదు కిలోల బియ్యం తగ్గాయి. ఈ పాస్ లో తన భర్త పేరు కనిపించక పోవడంతో కోటా తగ్గిందని తెలుసుకుంది. ఆయన పేరుంటేనే  ఆ అయిదు కేజీల బియ్యం కూడా ఇస్తానని డీలర్ చెప్పడంతో అసలు పేరు ఎందుకు తొలగించారని ప్రశ్నించింది.  డీలర్ సలహా ప్రకారం భర్త ఆధార్ నంబరును మీసేవా కేంద్రంలో ఇచ్చి పరిశీలించగా, అతను ఇంకో యువతి పేరిట ఉన్న రేషన్ కార్డులో నమోదైనట్టు తెలిసింది. ఒకే ఆధార్ సంఖ్య రెండు రేషన్ కార్డుల్లో ఉండకూడదు కాబట్టి ఒక కార్డులో ఆయన పేరు తొలగించారు. దీంతో గుట్టు రట్టయిపోయింది.
    
డబ్బు సంపాదన కోసం బెంగళూరు వెళ్తానని చెబుతూ  రెండో పెళ్లి చేసుకున్నాడని ఆ యువతి ఇప్పుడు ఏడుస్తోంది. ములకలచెరువుతో పాటు దుగ్గసానిపల్లె తదితర గ్రామాల్లోనూ ఇలా రెండు సంసారాల ఉదంతాలు ఆధార్ అనుసంధానంతో బయటపడ్డాయట. దీంతో చాలామంది ఆడవారు తమ భర్తలపై అనుమానంతో ఆధార్ నంబర్లతో మీసేవా కేంద్రాలకు వెళ్తున్నారట.  అయితే ఇలా రెండిళ్ల పూజారుల గుట్టు బయటపడుతున్న విషయం తెలిస్తే ఆధార్ రూపకర్త నందన్ నీలేకని కూడా ఆశ్చర్యపోతారేమో.
Tags:    

Similar News