భారతదేశంలో అమలు చేస్తున్న ఆధార్ ప్రక్రియపై దేశంలోని పలువురికి భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని పార్టీలైతే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అయితే ఈ విప్లవాత్మక సంస్కరణకు ఊహించని మద్దతు దక్కింది. ఆధార్ ఎంతో ఉన్నతమైనదని, దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఆధార్ తో పరిపాలనలో నాణ్యత పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సాధికారత పొందుతారని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ విశిష్ట గుర్తింపు విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరించవచ్చని చెప్పారు.
కేవలం ఆధార్ ను పొగడటంతోనే సరిపుచ్చకుండా గేట్స్ మరో తీపికబురు కూడా చెప్పారు. ఇతర దేశాల్లో ఆధార్ తరహా విధానాన్ని అమలు చేసేందుకు తమ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన తరఫున ప్రపంచబ్యాంక్ కు నిధులు అందజేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఆధార్ ప్రధాన రూపకర్త - ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ప్రపంచబ్యాంక్ కు సహకరిస్తున్నారని బిల్ గేట్స్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ లో వందకోట్ల మందికి పైగా భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని బిల్ గేట్స్ గుర్తు చేశారు. అది కేవలం బయో ఐడీ తనిఖీ పథకం అయినందున వ్యక్తుల గోప్యతకు ఎటువంటి నష్టం ఉండదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.
ఇదిలాఉండగా...ఆధార్ పై జరుగుతున్న ప్రచారానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డుల జారీకి కట్టుదిట్టమైన నమోదు - అప్ డేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నట్లు స్పష్టం చేసింది. వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 50వేల మందికి పైగా ఆపరేటర్లను నిషేధించినట్లు తెలిపింది. దుర్వినియోగానికి అవకాశం లేకుండా ఆధార్ నమోదు సాఫ్ట్ వేర్ లో తగిన భద్రత చర్యలు - తనిఖీలున్నాయని పేర్కొంది. ఆధార్ నమోదు సాఫ్ట్ వేర్ ట్యాంపరింగ్ అయిందని, దాన్ని నల్లబజారులో విక్రయించారని వచ్చిన ఆరోపణలను ఖండించింది.