బాబు 'అధికార' వాడకం: మరికొందరికీ మూడినట్టే

Update: 2020-02-12 07:30 GMT
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లు పరిపాలన లో టీడీపీ నాయకులకు కలిసొచ్చింది.. కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఆ ఐదేళ్ల బాబు పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రచార ఆర్బాటాలతో కాలం వెళ్లదీసిన అతగారి పాలనపై ఆ తర్వాత సీఎంగా వచ్చిన జగన్ గతాన్ని తవ్వుతున్నారు. చంద్రబాబు ‘అధికార’ వాడకాన్ని ఎలా చేశారో పరిశీలించి తప్పు చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు పాలనకు ఉద్యోగులు, అధికారులు బాగా సహకరించడంతో ఆ సహకారానికి జగన్ ప్రతిఫలం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఆ తర్వాత తాజాగా పరిపాలించిన ఐదేళ్లల్లో అధికార వర్గమంతా టీడీపీకి బానిసలా మాదిరి పని చేశారు.

అధికార పార్టీ నాయకులు చెప్పిందే చేయాలి.. ఎదురు తిరగ వద్దు.. ఎదురు తిరిగితే వనజాక్షి ఘటనలే ఎదురవుతాయనే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వ్యవహారం నడిచింది. అందుకే అధికారులంతా జీ హుజుర్ అంటూ బాబు పాలనకు జై కొట్టారు. వారు చెప్పిందల్లా చేశారు.. అందుకే ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అధికారులంతా అప్పటి చంద్రబాబు పాలనకు, అనైతిక చర్యలు, అక్రమాలు, అవినీతికి సహకరించడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టారు. గతాన్ని తవ్వితీసి టీడీపీ నాయకులకు చుక్కలు చూపించడం లో భాగంగా అధికారుల పై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ మొదటి చర్య. ఇంకా చాలా మందిపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది.

అయితే ఏబీ వెంకటేశ్వరావు వ్యవహారం పై టీడీపీ గుర్రుగా ఉంది. ఏకంగా ఏబీ వెంకటేశ్వరావు ను బహిర్గతంగా వెనకేసుకొస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏబీవీని వెనకేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు ఏబీవీకి మద్దతుగా మాట్లాడారు. ‘అధికారుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడతారా.? అని ఏకంగా జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. మీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు అక్రమాలకు పాల్పడి.. చాలామంది అధికారుల్ని అప్పట్లో మీరు బలి చేశారు.. ఆ మకిలీ వదిలించుకోవడానికి, మా హయాంలో పని చేసిన అధికారులపై మీరు పగపట్టారా.?’ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నిలదీశారు.

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఎలా ఉందంటే ‘ఆయనే మా పార్టీలో ఎవరికి ఎమ్మెల్సీ సీటు ఇస్తే మంచిదన్న విషయాన్ని డిసైడ్‌ చేస్తారు..’ అంటూ టీడీపీ నేతలు చెప్పే స్థాయికి ఉండేది. అందుకే వెంకటేశ్వరరావు చేసిన ‘సేవ’కు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా జగన్ కు ఆగ్రహం ఎందుకు వచ్చిందంటే.. విశాఖపట్టణం విమానాశ్రయంలో తనపై కత్తి దాడి జరిగితే ఈ పబ్లిసిటీ స్టంట్ అని స్వయంగా పోలీస్ అధికారులు ప్రకటించారు.

విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే, ‘కోడి కత్తి ఘటన - పబ్లిసిటీ స్టంట్‌’ అనే స్థాయిలో అప్పటి డీజీపీ వ్యాఖ్యానించారు.. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరావు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జగన్ ప్రతీకారం తీర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కూడా ఏబీ వెంకటేశ్వరరావు కీలక భూమిక పోషించారనే ఆరోపణలు కూడా ఉండడంతో మొదటి వేటు ఏబీవీపైనే పడింది. ఈ విధంగా జగన్ చర్యలు తీసుకుంటుండడంతో చంద్రబాబు హయాంలో అధికార సేవ చేసిన వారందరిలోనూ వణుకు పుడుతోంది. త్వరలోనే మరికొందరికీ మూడినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News