భార‌త్ కు వ‌చ్చిన అభినంద‌న్ ను ఏం చేస్తారు?

Update: 2019-03-02 04:50 GMT
పాక్ యుద్ధ‌విమానాన్ని కూల్చే క్ర‌మంలో ఆ దేశ స‌రిహ‌ద్దుల్లోకి వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ పొర‌పాటున వెళ్ల‌టం.. అదే స‌మ‌యంలో పాక్ ద‌ళాలు ఆయ‌న ఉన్న మిగ్ ను కూల్చేయ‌టం తెలిసిన విష‌యాలే. దాదాపు 60 గంట‌ల పాటు పాక్ చెర‌లో ఉన్న అభినంద‌న్ ను.. అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి వ‌చ్చిన ఒత్తిడితో వ‌దిలిపెట్టిన పాకిస్థాన్ పార్ల‌మెంటు తీసుకున్న  నిర్ణ‌యంతో అభినంద‌న్ నిన్న (శుక్ర‌వారం) సాయంత్రం భార‌త్ కు చేరుకున్నారు.

యావ‌త్ దేశమంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన అభినంద‌న్ దేశానికి తిరిగి వ‌చ్చేశారు. భార‌తీయులంతా ఎంతో ఆనందంతో సంబ‌రాలు చేసుకున్నారు. మ‌రి.. తిరిగి వ‌చ్చిన అభినంద‌న్ కు ఎప్ప‌టిలానే ఆయ‌న చేస్తున్న పోస్టు ఇచ్చేస్తారా?  ఆయ‌న విధుల్లోకి ఎప్ప‌టి నుంచి చేర‌తారు?  ఇంత‌కీ ఆయ‌న ఇంటికి ఎప్పుడు వెళ్ల‌నున్నారు?  లాంటి ప్ర‌శ్న‌ల‌కు సమాధానం వింటే కాసింత అవాక్కు అవ్వాల్సిందే.

త‌న ధైర్య సాహ‌సాల‌తో భార‌తీయుల గుండెల్ని దోచేసిన అభినంద‌న్ కు ఉద్యోగం తిరిగి ఇవ్వ‌టం త‌ర్వాత‌.. ఆయ‌న ఇంటికి వెళ్ల‌టానికి ఇప్ప‌టికిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే.. శ‌త్రు దేశంలో కొంత‌కాలం ఉండి వ‌చ్చిన ఆయ‌న‌కు చాలానే ప‌రీక్ష‌లు ఉంటాయి. వాటిని ఆయ‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌ర్వాతే ఏమైనా.

భార‌త్ కు తిరిగి వ‌చ్చిన అభినంద‌న్ ఇప్పుడు ఎలాంటి ప‌రీక్ష‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది?  ఎందుక‌లా? అంటే.. శ‌త్రుదేశం నుంచి తిరిగి రావ‌టంతో అత‌డి మాన‌సిక‌.. శారీర‌క ప‌రిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌టంతోపాటు.. చాలానే ప్రొసీజ‌ర్ ఉంద‌ని చెబుతున్నారు  అయితే.. ఇదంతా చాలా గౌర‌వంతోనూ.. మ‌ర్యాద‌తోనూ చేస్తారే త‌ప్పించి అవ‌మానించేలా చేయ‌ర‌ని చెబుతున్నారు.

నిపుణులు చెబుతున్న ప్ర‌కారం అభినంద‌న్ ఎదుర్కొనే ప్రొసీజ‌ర్ ఏమిటి?  ఎందుకు ఈ విధానాన్ని పాటిస్తార‌న్న విష‌యాల్లోకి వెళితే..

+  భార‌త్ కు చేరిన అభినంద‌న్ ను నేరుగా భార‌త వాయుసేన అంటెలిజెన్స్ యూనిట్ కు అప్ప‌గిస్తారు. వారు అభినంద‌న్ శారీర‌కంగా ఎంత ఫిట్ నెస్ తో ఉన్నారో కొన్ని వైద్య ప‌రీక్ష‌లు జ‌రుపుతారు. శ‌త్రు దేశం ఆయ‌న దుస్తుల్లో కానీ శ‌రీర భాగాల్లో కానీ ఏమైనా బ‌గ్ (గూఢ‌చ‌ర్యం నిమిత్తం ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్ని) ఏర్పాటు చేశారా? అన్న విష‌యాల‌పై దృష్టి సారిస్తారు. క్షుణ్ణంగా త‌నిఖీలు జ‌రిపిన త‌ర్వాత వింగ్ క‌మాండ‌ర్ మాన‌సిక ప‌రిస్థితి ఎలా ఉంటుందో కూడా ప‌రీక్ష‌లు జ‌రుపుతారు.

+  శ‌త్రుదేశానికి చిక్కిన త‌ర్వాత వారేమీ అతిథి మ‌ర్యాద‌లు చేయ‌రు. ప్ర‌త్య‌ర్థి దేశ ర‌క్ష‌ణ ర‌హ‌స్యాల్ని తెలుసుకోవ‌టానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్ర‌శ్న‌లు సంధిస్తారు. పెద‌వి విప్ప‌కుంటే చిత్ర‌హింస‌లు పెడ‌తారు. ఆ ఒత్తిడిని ఎదుర్కొని మ‌రీ నోరు విప్ప‌ని ప‌రిస్థితి కొంద‌రిలో ఉంటుంది. అభినంద‌న్ విష‌యంలో అదెంత వ‌ర‌కు?  అన్న‌ది గ‌మ‌నిస్తారు. ఆ కోణంలో ఆయ‌న్ను విచారిస్తారు.

+ అనంత‌రం ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) రీసెర్చ్.. రా (అనాల‌సిస్ వింగ్) అధికారులు కూడా అభినంద‌న్ ను క్షుణ్ణంగా విచారిస్తారు. సాధార‌ణంగా యుద్ధ ఖైదీల‌కు అయితే ఈ రెండు సంస్థ‌ల విచార‌ణ అవ‌స‌రం లేద‌ని.. కానీ అభినంద‌న్ ను యుద్ధ ఖైదీగా ప‌రిగ‌ణించాలో లేదో అన్న సందేహం ఉండ‌టంతో ఈ రెండు సంస్థ‌ల‌కు చెందిన అధికారులు కూడా ప్ర‌శ్న‌లు సంధించే వీలుంది.

+  ఇలా ఇన్ని ద‌శ‌లు దాటిన త‌ర్వాత‌.. ఆయ‌న్ను ఇంటికి పంపుతారు. పాక్ సైన్యానికి బంధీగా ఉన్న వేళ‌లో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ధీర‌త్వం.. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు హుందాగా చెప్పిన స‌మాధానాల‌తో ఆయ‌న దేశ భ‌క్తిని శంకించే ప‌రిస్థితి లేకున్నా.. చిన్న వీడియో క్లిప్ తో ఒక స‌మాధానానికి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. ఎందుకంటే.. ఆయ‌న 60 గంట‌ల పాటు పాక్ చెర‌లో ఉన్నారన్న విష‌యాన్ని కీల‌కం అవుతుంది. పాక్ లో ఉన్న 60 గంట‌ల్లో ఏం జ‌రిగింది?  ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగారు.. వారేం అడిగితే.. అభినంద‌న్ ఏం చెప్పార‌న్న విష‌యాల్ని క్షుణ్ణంగా మ‌న అధికారులు రాబ‌డ‌తారు. ఇవ‌న్నీ జ‌రిగిన త‌ర్వాత మాత్ర‌మే అభినంద‌న్ ను ఇంటికి పంపుతారు.


Tags:    

Similar News