ల‌గ‌డ‌పాటి ఇంట పంచెల కార్య‌క్ర‌మం.. వెళ్లిన ఆర్కే

Update: 2019-01-30 05:12 GMT
ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్.. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ.. ఈ రెండు పేర్లు తెలుగు ప్ర‌జ‌ల‌కు కొత్తేం కాదు. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ఒక‌రికొక‌రు బాగానే తెలుసు. అయితే.. ఈ తెలీయ‌టం.. వారి మ‌ధ్య‌నున్న బంధం ఎంత బ‌ల‌మైన‌ద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఒక మీడియా అధిప‌తిగా క్ష‌ణం తీరిక లేకుండా ప‌నుల షెడ్యూల్స్ లో హ‌డావుడిగా ఉండే ఆర్కే.. ఒక నేత ఇంట జ‌రిగిన ఒక చిన్న కార్య‌క్ర‌మానికి ప‌క్క రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ హాజ‌ర‌వుతారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇంట జ‌రిగిన పంచెల కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ హాజ‌ర‌య్యారు. ఒక ప్ర‌ముఖుడి ఇంట జ‌రిగిన వేడుక‌కు మ‌రో ప్ర‌ముఖుడు హాజ‌రు కావ‌టం త‌ప్పేం కాదు. కాకుంటే.. చిన్న కార్య‌క్ర‌మానికి సైతం పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇచ్చి మ‌రీ హాజ‌రుకావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

స్వ‌త‌హాగా కాంగ్రెస్ వాది అయిన ల‌గ‌డ‌పాటి.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తాను రాజ‌కీయాల్ని వ‌దిలేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. అందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న రాజ‌కీయ పార్టీలో కొన‌సాగ‌న‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల‌తో పెన‌వేసుకొని ఉండే స‌ర్వేలు.. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ పేరుతో త‌ర‌చూ వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌గ‌డ‌పాటిని త‌ర‌చూ క‌లుస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ‌.. బాబుతో ల‌గ‌డ‌పాటి భేటీలు కావ‌టం చూస్తుంటే.. ప్ర‌జ‌ల మూడ్ తెలుసుకునే స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని ఇచ్చి ఉంటార‌ని అనుకుంటున్నారు. ల‌గ‌డ‌పాటితో ఈ ప‌ని చేయించేందుకు ఆంధ్ర‌జ్యోతి ఎండీ ఆర్కే సాయాన్ని తీసుకొని ఉంటార‌ని చెబుతున్నారు. ఇదే.. ల‌గ‌డ‌పాటి.. ఆర్కేల‌మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. ఇప్పుడీ అంశం అంద‌రిదృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News