ఏపీలో దడ పుట్టిస్తోన్న ఏసీబీ రైడ్స్...!

Update: 2020-02-18 11:15 GMT
ఏపీలో గత కొన్ని రోజులుగా ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడులతో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది. కొద్దిరోజుల ముందు వరకు ఎమ్మార్వో ఆఫీసులను టార్గెట్ చేసి ఏసీబీ - తాజాగా  మున్సిపల్ కార్యాలయాలను - టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేస్తూ  సోదాలు చేస్తుంది. రాష్ట్రంలో అవినీతి అనేదే లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని , ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ ఆదేశించడం తో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈరోజు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు - టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై జరుగుతున్న ఏసీబీ దాడులు అధికారిక వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు ఏసీబీకి వరుసగా కొన్ని ఫిర్యాదులు అందాయి. అలాగే  అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల పట్ల కూడా అధికారుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అలాగే  నిబంధనలకు విరుద్దంగా ప్లాన్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అటువైపు ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలోనే విశాఖ - విజయవాడ - ఒంగోలు - విజయనగరం - నెల్లూరు - అనంతపురం - కర్నూల్  - చిత్తూరు - తూర్పు గోదావరి - పశ్చిమ గోదావరి - గుంటూరు - శ్రీకాకుళం - కడప జిల్లాలలోని మున్సిపల్ కార్యాలయాలపై ఏకకాలంలో జరిపిన మెరుపు దాడితో అధికారులకు చెమటలుపట్టిస్తున్నారు. అలాగే  విశాఖలోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఫిర్యాదులు అందడంతో..అక్కడ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. విశాఖ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో జోన్ 1 - జోన్ 5 కార్యాలయాల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలాభాను నేతృత్వంలో అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విజయవాడలో సైతం ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌ లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అలాగే , ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు . టౌన్ ప్లానింగ్ విభాగంలోని కీలక రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు, అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఫిర్యాదుల పై తనిఖీలు నిర్వహిస్తున్నారు.   ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి బిల్డింగ్ ప్లాన్ పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అతని దగ్గర నుంచి ఐదువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Tags:    

Similar News