రాజును కెలికి మ‌రీ తిట్లు తిన్న అచ్చెన్న‌!

Update: 2019-02-01 09:18 GMT
ఏపీ టీడీపీ నేత‌ల‌కు నోరు ఎక్కువే. ఇక‌.. సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉన్న వేళ‌.. అసెంబ్లీలో తెలుగు త‌మ్ముళ్లు చెల‌రేగిపోయే వైనం తెలిసిందే.  అధికార తెలుగుదేశం పార్టీ తీరును నిర‌సిస్తూ గ‌డిచిన కొంత‌కాలంగా విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స‌భ‌కు హాజ‌రు కావ‌టం లేదు. విప‌క్ష నేత‌లు లేకుండా స‌భ‌ను న‌డ‌ప‌టంతో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అయిన‌ప్ప‌టికీ ఇవేమీ ప‌ట్టించుకోకుండా అసెంబ్లీ స‌మావేశాలు సాగుతున్నాయి.

ఇప్పుడు స‌భ‌లో టీడీపీ.. బీజేపీ స‌భ్య‌లు మాత్ర‌మే ఉంటున్నారు. మొద‌ట మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ.. హోదా విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య పెరిగిన దూరంతో విప‌క్ష పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం జ‌రిగిన ఏపీ అసెంబ్లీ స‌మావేశం హాట్ హాట్ గా సాగింది. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఫైర్ బ్రాండ్ పేరున్న ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత విష్ణుకుమార్ రాజును కెలికి మ‌రీ తిట్టించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎక్క‌డో ట‌చ్ చేసే మాట‌ను అన‌టంతో అందుకు పోటీగా విష్ణుకుమార్ రాజు బ‌లంగా రిటార్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేశారు.

ఈ విష‌యాన్ని ప్ర‌శ్నించిన విష్ణుకుమార్ రాజు.. మేడా రాజీనామా ఎందుకు చేశారో చెప్పాలంటూ అచ్చెన్నాయుడ్ని ప్ర‌శ్నించారు. కెల‌క‌ట‌మే త‌ప్పించి.. ఎదుటోళ్లు కెలికితే త‌ట్టుకోలేని అచ్చెన్న‌.. ఇత‌ర టీడీపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే ప్ర‌య‌త్నం చేశారు. తెలుగు త‌మ్ముళ్లు చెల‌రేగిపోతున్నా.. విష్ణుకుమార్ రాజు మాత్రం హుందాగా మాట్లాడి.. త‌మ్ముళ్లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేశారు. ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ ను.. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా.. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు బ‌య‌ట‌కు పంప‌టం లేదంటూ ప్ర‌శ్నించారు. తానీ విష‌యాన్ని అడ‌గ‌టం లేద‌ని.. ఏపీ ప్ర‌జ‌లు అడుగుతున్నారంటూ మండిప‌డ్డారు.

ఇలా ప్ర‌భుత్వం ఇరుకున ప‌డేలా విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య‌లు చేస్తున్న నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మంట‌పుట్టింది. బ్యాలెన్స్ త‌ప్పిన బాబు.. విష్ణుపై ఫైర్ అయ్యారు. సెన్స్ లేకుండా మాట్లాడారంటూ మండిప‌డ్డారు. మొత్తానికి తెలుగు త‌మ్ముళ్ల‌కు మంట పుట్టేలా విష్ణు వ్య‌వ‌హారం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News