వైసీపీకి సినీ గ్లామ‌ర్ పెరుగుతోందే!

Update: 2017-08-04 09:26 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి ఇప్ప‌టికే సినీ గ్లామ‌ర్ బాగానే ఉంది. అయితే గ‌తంలో మాదిరిగా ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్న న‌టులు దాదాపుగా క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ఆ పార్టీలో చేరిన వారిలో ముర‌ళీమోహ‌న్ లాంటి కొంద‌రు సీనియ‌ర్లు పార్టీనే అంటిపెట్టుకుని ఉండ‌గా, అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌న్న ఆవేద‌న‌లో బాబూ మోహ‌న్ లాంటి నేత‌లు ఆ పార్టీని వీడి ఇత‌ర పార్టీల్లో చేరిపోయారు. ఇక టీడీపీ త‌ర‌ఫున గుంటూరు లోక్ స‌భ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కుమారి త‌న‌యుడు గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు స్వ‌యానా బావ మ‌రిది అయిన టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబు అస‌లు ప్ర‌చారంలోనే పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల వినిపించిన వార్త‌ల ప్ర‌కారం సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబం వైసీపీ వైపు మొగ్గుతున్న‌ట్లుగా తెలుస్తోంది. కృష్ణ సోద‌రుడు ఆది శేష‌గిరిరావు ఇప్ప‌టికే వైసీపీలో కీల‌క నేతా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రోవైపు ఉన్న మాట‌ను ముఖం మీదే నిర్మోహ‌మాటంగా చెప్పే అలవాటు ఉన్న పోసాని కృష్ణ‌ముర‌ళి వంటి నేత‌లు బ‌హిరంగంగానే జ‌గ‌న్ స్టామినాను కీర్తిస్తూ వ‌స్తున్నారు. తాను ఓటు వేస్తే జ‌గ‌న్‌ కే వేస్తాన‌ని, టీడీపీకి చచ్చినా వేయ‌న‌ని కూడా ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన వైనం మ‌నం మరిచిపోలేనిదే. ఈ క్ర‌మంలో ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్న సినీ స్టార్లు అస‌లు లేర‌నే చెప్పాలి. అయితే వైసీపీకి మాత్రం ఈ ప‌రిస్థితి లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. టాలీవుడ్‌ లోని ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు వైసీపీలోకి దూకేసేందుకు స‌రైన టైమ్ కోసం వేచి చూస్తున్నార‌న్న వార్త‌లు కూడా లేక‌పోలేదు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టాలీవుడ్‌ లో కేరెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైపోయింద‌ని తెలుస్తోంది. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన హేమ‌... కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం అలుపెర‌గ‌ని పోరు సాగిస్తున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి మ‌ద్ద‌తుగా ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ముద్ర‌గ‌డ ఉద్య‌మాన్ని ఆస‌రా చేసుకుని ఆమె చంద్ర‌బాబు స‌ర్కారుపై ప‌లుమార్లు నిప్పులు చెరిగారు కూడా. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయ తెరంగేట్రం చేసిన హేమ‌... నాడు న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న పుణ్య‌మా అని న‌ల్లారికి వ్య‌తిరేకంగా వీచిన గాలి కార‌ణంగా ఆమె ఓట‌మిపాల‌య్యారు.

తాజాగా మ‌రోమారు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తున్న హేమ‌.... ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆమెకు వైసీపీ నేత‌ల నుంచి ఆహ్వానం అందింద‌ని, స‌రైన ముహూర్తం కోసం ఆమె వేచి చూస్తున్నార‌ని కూడా స‌మాచారం. ఈ విష‌యం తెలుసుకున్న కార‌ణంగానే టీడీపీ నేత‌లు ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని, వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ గా వెలుగుతున్న న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెక్ పెట్టేందుకే హేమ‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నార‌ని కూడా టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన వైసీపీ నేత‌లు... హేమ త‌మ పార్టీలో చేర‌డం ఖాయ‌మ‌ని, పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే ఆమె పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని, పార్టీలో వేరెవ‌రికో చెక్ పెట్టేందుకు హేమ‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News