కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు... సినీ న‌టుడి కామెంట్స్ వైర‌ల్‌!

Update: 2022-10-02 05:40 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్ర‌ముఖ సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. కేసీఆర్ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడ‌ని కొనియాడారు. కేసీఆర్ గొప్ప నాయ‌కుడ‌ని.. ఆయ‌న‌కు ఒక విజ‌య‌న్ ఉందని ప్ర‌శంసించారు. మ‌తోన్మాదులు ఆయ‌నను ఇబ్బంది పెట్టాల‌ని చూసినా ఆయన బెద‌ర‌లేద‌ని గుర్తు చేశారు. దేశంలోనే తెలంగాణ‌ను నెంబ‌ర్ వ‌న్ గా నిలిపార‌ని కొనియాడారు. తాను చూసిన నేత‌ల్లో కేసీఆర్ గొప్ప నాయ‌కుడన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి అని అభినందించారు. కేసీఆర్ లాంటి నాయకుడు దొరకడం తెలంగాణ ప్ర‌జ‌ల అదృష్టమని చెప్పారు.

కరీంనగర్‌ కళోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ‌ మంత్రి గంగుల కమలాకర్,  జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ.. తదితరులు పాల్గొన్నారు.  కళోత్సవానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌కాష్ రాజ్‌ మాట్లాడుతూ.. తాను కరీంనగర్ రావడం ఇదే  మొదటిసారి అని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ భాషను, యాసను చులకనగా చూసేవారని గుర్తు చేశారు. సినిమాల్లో కామెడీ పాత్ర‌ల‌కు మాత్రమే తెలంగాణ భాష‌ను వాడేవరని ఆవేదన వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ భాష అందరికీ తెలుస్తోందన్నారు. తెలంగాణలో అద్భుతమైన కళాకారులు ఉన్నారని ప్ర‌శంసించారు.

క‌ళోత్సవంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన ప్ర‌కాష్ రాజ్ వారి ఆటపాటలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి.. పలువురు కళాకారులను ప్రకాష్ రాజు ఘ‌నంగా సన్మానించారు. కళాకారులతో కలిసి డ్యాన్సు కూడా వేశారు.

కాగా బీజేపీపై ప్ర‌కాష్ రాజ్ గ‌త కొన్నేళ్లుగా మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్ట‌ర్లో బీజేపీ నేత‌ల‌ను, బీజేపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ప్ర‌కాష్ రాజ్ ఎన్నో ట్వీట్లు చేశారు. క‌ర్ణాట‌క‌లో గౌరీ లంకేష్‌ను హ‌త్య చేశాక మ‌తోన్మాదుల హిట్ లిస్టులో ప్ర‌కాష్ రాజ్ పేరు కూడా ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

గ‌త ఎన్నిక‌ల్లో బెంగ‌ళూరు నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయారు. అయితే రాజ‌కీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణ‌లో ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపుతార‌ని.. కేంద్ర స్థాయిలో ప్ర‌కాష్ రాజ్ సేవ‌ల‌ను వాడుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చినా నిజం కాలేదు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ క్రియాశీల‌క పాత్ర పోషిస్తార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక కోసం కేసీఆర్‌ ప్రయత్నాలు చేసిన సమయంలో ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించారు. కర్ణాటక, మహారాష్ట్రలకు కేసీఆర్‌ వెళ్లిన సమయంలో ప్రకాష్ రాజ్‌ కూడా ఆయ‌న వెంట ఉన్నారు.
Tags:    

Similar News