శీతాకాల సమావేశాలు వేసవిలో పెడతారా

Update: 2017-11-26 08:00 GMT
కొన్నాళ్లుగా బీజీపీపై విరుచుకుపడుతున్న నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే వేసవిలో నిర్వహిస్తారా అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించిన ఆయన ప్రశ్నించారు. శీతాకాల సమావేశాలు జరగాల్సిన సమయంలో ఇంకెక్కడైనా బిజీగా ఉన్నారా అంటూ పరోక్షంగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిజీగా ఉన్న విషయం గుర్తు చేశారు. అంతేకాదు... అసలు సమావేశాలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నారన్న ప్రశ్న ప్రకాశ్ రాజ్ నుంచి వచ్చింది. జీఎస్టీ సహా అనేక అంశాలపై ప్రభుత్వం ఇరుకునపడే పరిస్థితి ఉండడంతోనే సమావేశాలు నిర్వహించలేదన్నారు.

అయితే... ప్రకాశ్ రాజ్ అంటున్నట్లుగా గుజరాత్ ఎన్నికల ముందు సమావేశాలు నిర్వహించనప్పటికీ  శీతాకాల సమావేశాలు వచ్చే డిసెంబరు 15 నుంచి నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రకాశ్ రాజ్‌ విమర్శలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డిసెంబరు నెల అంటే వేసవి కాలమా అని వారు ప్రశ్నిస్తున్నారు.

కాగా ప్రకాశ్ రాజ్ ఇటీవల కూడా ఓ బీజీపీ ఎంపీకి లీగల్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ఆయన రీసెంటుగా మైసూర్ ఎంపీకి నోటీసులు కూడా పంపించారు. గతంలో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య విషయంలోనూ ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. అప్పటి నుంచి బీజేపీ, ప్రకాశ్ రాజ్ మధ్య నిత్యం రచ్చ జరుగుతూనే ఉంది.
Tags:    

Similar News