ఈ మౌనానికి అర్థమేంటి.. ముఖ్యమంత్రిపై నటీమణి ఫైర్‌!

Update: 2022-10-29 05:34 GMT
ప్రముఖ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ తనను పెద్ద ఐటెమ్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సైదైయ్‌ సాదిక్‌పై మరోసారి మండిపడ్డారు. ఈ విషయంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. సాదిక్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తారని తాను ఆశించానన్నారు. అయినా ఇంతవరకు స్టాలిన్‌ స్పందించకపోవడం తనను విస్మయపరుస్తోందన్నారు.

కాగా తమిళనాడు బీజేపీలో ఉన్న నటీమణులు.. ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రి రఘురామ్‌లను డీఎంకే నేత సైదైయ్‌ సాధిక్‌ ఐటెమ్‌లంటూ వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలోకి ఖుష్బూ పెద్ద ఐటెమ్‌ అంటూ సాదిక్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ట్విట్టర్‌లో ఖుష్బూ.. స్టాలిన్, ఆయన సోదరి, ఎంపీ అయిన కనిమొళిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో కనిమొళి బహిరంగ క్షమాపణ చెప్పారు. డీఎంకే పార్టీ నేతగా, మహిళగా సాదిక్‌ చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెబుతున్నాన్నారు. ఈ వ్యాఖ్యలను డీఎంకే పార్టీ, ముఖ్యమంత్రి స్టాలిన్‌ అంగీకరించరన్నారు.

మరోవైపు సైదైయ్‌ సాదిక్‌ తన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాను ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని ఆయన కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశారు.

కాగా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పందించకపోవడంతో ఖుష్బూ తన స్వరాన్ని పెంచారు. తనకు 22 ఏళ్లు, 20 ఏళ్లు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, తాను వారిద్దరికీ రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటున్నానని తెలిపారు. తనపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే తన కుమార్తెలు తన గురించి ఏమనుకుంటారని నిలదీశారు.

ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఖుష్బూ నిలదీశారు. స్టాలిన్‌ మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. స్టాలిన్‌ తనకు ఈ విషయంలో అండగా ఉంటారని ఆశిస్తున్నానన్నారు. సాదిక్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాడతానని.. ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ఆమె తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

సాదిక్‌ లాంటి వ్యక్తిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్‌ చేయడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఖుష్బూ .. స్టాలిన్‌ను ప్రశ్నించారు. తన పరువు, గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని తేల్చిచెప్పారు. తమ పార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సీఎం స్టాలిన్‌ మౌనంగా ఉంటారా అని ఖుష్బూ ప్రశ్నించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News