మ‌హిళ‌ల‌పై ఇవేం మాట‌లు ఆది సార్‌!

Update: 2017-08-12 12:09 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పుణ్య‌మా అని ఇప్పుడు ఏపీలోని అధికార టీడీపీ - విప‌క్ష వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. రెండేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఈ ఉప ఎన్నిక‌ను సెమీ ఫైన‌ల్‌ గా భావిస్తున్న అధికార పార్టీ నేత‌లు.. అక్క‌డ ఎలాగైనా గెలిచి తీరాల్సిందేన‌ని భావ‌న‌తో అక్క‌డ భారీ యంత్రాంగంతో మోహ‌రించేశారు. ప‌ది మందికి పైగా మంత్రుల‌తో పాటు క‌ర్నూలు జిల్లాకు చెందిన మొత్తం టీడీపీ నేత‌లు - ఇత‌ర జిల్లాల‌కు చెంది కాస్తంత నోరు ఉన్న నేత‌లుగా పేరున్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నంద్యాల‌లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ కూడా భారీ ఎత్తునే ప్ర‌చారం చేస్తున్నా... టీడీపీ దింపినంత‌గా నేత‌ల‌ను దింప‌లేద‌నే చెప్పాలి.

అక్క‌డ మోహ‌రించిన ఇరు పార్టీలకు చెందిన నేత‌ల సంఖ్య‌ను అలా ప‌క్క‌న‌బెడితే... ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు మాత్రం ఒక‌రిపై ఒక‌రు ఘాటు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఏ పార్టీ అయినా... అధికార పార్టీ త‌న అధికారాన్ని వినియోగించి ఉప ఎన్నిక‌ను కైవ‌సం చేసుకునే య‌త్నం చేస్తుంద‌న్న భావ‌న‌తో కాస్తంత ఎక్కువ‌గా విరుచుకుప‌డే విష‌యాన్ని ఏ ఒక్క‌రూ కాద‌న‌లేని విష‌య‌మే. ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నంద్యాల ప్ర‌చారంలో భాగంగా అధికార పార్టీ కుట్ర‌ల‌పైనా - సీఎం చంద్రబాబుపైనా నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలి హోదాలో ఉన్న న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా త‌న‌వంతుగా అక్క‌డ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో చేస్తున్న వ్యాఖ్య‌లు - టీడీపీ నేత‌ల‌పై విసురుతున్న పంచ్‌ ల‌కు టీడీపీ నిజంగానే డంగైపోతున్నార‌న్న వాద‌న లేక‌పోలేదు. ఎందుకంటే... అధికార పక్షం - ఆ పార్టీ నేత‌ల‌కు సూటిగా ప్ర‌శ్న‌లు సంధిస్తున్న రోజా త‌న‌దైన శైలిలో మాట‌ల తూటాలు పేలుస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆమె సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త‌ను మ‌రిచిన అధికార పార్టీ నేత‌లు ఆమెపై దిగ‌జారుడు వ్యాఖ్య‌ల‌తో అడ్డంగా బుక్కైపోయార‌న్న వాదన వినిపిస్తోంది. కాసేప‌టి క్రితం నంద్యాల‌లో మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి... రోజాపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వస్త్రధారణపై రోజా మాట్లాడితే పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. మంత్రి అఖిలప్రియపై రోజా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వైసీపీ ఓటుకు రూ. 5 వేలు పంచినా చివరికి మాత్రం గెలుపు టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓ మ‌హిళా నేత‌ను బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతోందంటూ మంత్రి హోదాలో ఉన్న ఆదినారాయ‌ణ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌తో అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు కూడా షాక్ కు గుర‌య్యార‌ట‌.
Tags:    

Similar News